నేటి నుంచి ఏడు జిల్లాల్లో కరువు పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో 9 మంది ప్రతినిధులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. వీరంతా 3 బృందాలుగా ఏర్పడి కరువు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెవెన్యూశాఖ రూపొందించిన షెడ్యూల్ మేరకు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఒక బృందం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు మరొక బృందం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఒక బృందం వెళ్లనుంది. కేంద్ర బృందాలకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బృందానికి ఒక్కో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు తెలిసింది.
ఆ బృందాలకు కరువు పరిస్థితులను సమగ్రంగా వివరించేలా.. వ్యవసాయ, గ్రామీణ నీటిసరఫరా, పశుసంవర్ధక, రెవెన్యూశాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. కేంద్ర ప్రతినిధులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ కానున్నారు. జిల్లాల పర్యటన అనంతరం ఈనెల 8న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరువు అంచనా కోసం కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు ఆ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.
రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందాలు
Published Mon, Dec 7 2015 12:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement