కరీంనగర్‌సిటీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)కు వ్యతిరేకంగా గ్రానైట్ వ్యాపారులు ఆందోళనను ఉధృతం చేశారు. మూడు రోజులపాటు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టిన గ్రానైట్ మా ర్బుల్ వ్యాపారులు సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. జీఎస్‌టీ ద్వారా గ్రానైట్ పరిశ్రమలపై 28శాతం పన్ను విధించడాన్ని నిరసిస్తూ కరీం నగర్‌లోని పద్మనగర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 28శాతం పన్నును 5 శాతానికి తగ్గించి గ్రానైట్ పరిశ్రమను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట సేపు ఆందోళన అనంతరం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. రెండు శాతంగా ఉన్న పన్నును 28 శాతానికి పెంచిందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రానైట్ పరిశ్రమలపై భారం పడి మూతపడే ప్రమాదముందన్నారు.
పరిశ్రమనే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందుని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమగా పేరుగాంచిన గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడాలని కోరారు. లేనిపక్షంలో నిరవ«ధికంగా గ్రానైట్ సంస్థలను మూసేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి గంగుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.