పనుల పందేరం | The contractors are threatened to participate in tenders | Sakshi
Sakshi News home page

పనుల పందేరం

Published Fri, Jun 30 2017 3:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

పనుల పందేరం

పనుల పందేరం

ఒంగోలు:  కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా బెదిరించి ఎస్టిమెంట్‌ రేట్లకే పనులు దక్కించుకొని అందినకాడికి దండుకునేందుకు కార్పొరేషన్‌ అధికారులు, అధికార పార్టీ నేతలు మరోమారు సిద్ధమయ్యారు. తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనానికి గండి కొట్టనున్నారు. ఈ మేరకు అధికార పార్టీ నేతలు, అధికారులు గురువారం ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల టెండర్లు నిర్వహించిన 60 పనులతో పాటు మరో 40 పనులను జత చేసి దాదాపు11 కోట్ల రూపాయల పనులను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. పోటీకి వేరేవ్వరూ కాంట్రాక్టర్లు రాకుండా కార్పొరేషన్‌ అధికారులు చూసుకోవాలని అధికార పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ముఖ్యనేతతో పాటు అధికారులకు 12 శాతం కమీషన్‌ ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 11 కోట్ల పనులకు మొక్కుబడి టెండర్లు నిర్వహించనున్నారు.

డివిజన్‌కు రెండు పనులు..
అభివృద్ధి పనులకు పోటీ టెండర్లు జరిగితే 15 శాతం 20 లెస్‌లకు పనులు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. పోటీ లేకపోవడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. ఇక సిమెంట్‌ రోడ్ల విషయానికి వస్తే ఎస్టిమెంట్‌ రేట్లకు పనులు వస్తే 25 శాతం పర్సంటేజీ ఇచ్చేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే 25 శాతం నిధులు మిగిలినట్లే. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై కాంట్రాక్టర్లను బెదిరిస్తుండటంతో టెండర్లు వేసేందుకు మిగిలిన వారు ముందుకు రావడం లేదు. ఇదే సాకుతో ఎస్టిమెంట్‌ రేట్లకు అధికార పార్టీ నేతలు పనులు దక్కించుకుంటున్నారు. తాజాగా గతంలో కేటాయించిన 60 పనులతో పాటు మరో 40 పనులను జత చేసి 50 డివిజన్ల పరిధిలో డివిజన్‌కు రెండు పనుల చొప్పున కేటాయించేందుకు ఇటు అధికార పార్టీ నేతలు, అధికారుల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇక పనుల కేటాయింపే తరువాయి. ఇప్పటికే పేరుకు టెండర్లు నిర్వహించిన దాదాపు రూ.10 కోట్ల పనులు కాంట్రాక్టర్లు మొదలుపెట్టలేదు.

ఇటీవల మరో 26 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఇవి మొదలు కాలేదు. ప్రస్తుతం మరో రూ.11 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటాయించిన పనులను కాంట్రాక్టర్లు చేపట్టకపోయినా అధికారులు పట్టించుకోవటం లేదు. అడిగిన వారికి పనులు అప్పగించి తమ వాటా కమీషన్‌ పొందేందుకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్న విమర్శలున్నాయి. ఇందులో భాగంగా మరోమారు నగరంలో పనుల కేటాయింపుకు అధికార పార్టీ నేతలు, అధికారులు సిద్ధమయ్యారు.

ప్రత్యేకాధికారికి పట్టదా..?
నగరపాలక సంస్థ అభివృద్ధి పనులను అక్రమ పద్ధతిలో పద్ధతి ఎస్టిమెంట్‌ రేట్లకే అప్పగిస్తున్న కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్‌ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టెండర్లు నిర్వహిస్తే దాదాపు 20 నుంచి 25 శాతం నిధులు ఆదా అయ్యేవి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని అభివృద్ధి పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే మరింత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement