గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట
-
శాసనసభ పక్ష కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్
హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని శాసన సభ పక్ష కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు.
ఈ కమిటీ మంగళవారం జిల్లాలో పర్యటించింది. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా రేఖా నాయక్ ముఖ్యఅతిథి గా పాల్గొని కొమురం భీం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రేఖా నాయక్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఆదివాసీలను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఆడపిల్లలు భారం కావద్దని కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం, గిరిజన భవన నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. కొమురం భీంను గుర్తిం చిన ప్రభుత్వం జోడెఘాట్‌లో కొమురం భీం మ్యూజియం ఏర్పాటు చేస్తుందన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం జోడెఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు మం జూరు చేసిందన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ కొమురం భీంను గుర్తు చేసుకోకుండా ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోలేమన్నారు. హైదరాబాద్‌లో గిరిజనులకు ఆది వాసీ, బంజార భవన్ ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు కొమురం భీం చరిత్ర వెలుగులోకి రాకుండా కుట్రలు పన్నారని ఆరోపించా రు. ఆదివాసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గా మాత్రమే చూసిందని విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, జన్ను జకార్య, గైనేని రాజన్, జోరిక రమేష్, సబావత్, వీరమ్మ, సదానందం, శ్రీజా నాయక్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు.