విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వం
- ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజం
- కలెక్టరేట్ వద్ద విద్యా పరిరక్షణ కమిటీ ధర్నా
అనంతపురం అర్బన్:
ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి పేదలకు నాణ్యమైన విద్యాను అందేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా విద్యావ్యవస్థని నాశనం చేసేందుకు సిద్ధపడుతోందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు ఆయనతో పాటు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
పాఠశాలల మూసివేత, స్థాయి కుదింపునకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయన్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,476 పాఠశాలల మూసివేత, 1,349 పాఠశాలను ఆదర్శ పాఠశాల్లో విలీనం చేశారన్నారు. దీంతో వేల సంఖ్యలో విద్యార్థులు చదువు మానేశారన్నారు. బాలికలను ఇతర గ్రామాల్లోని పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని, దీంతో వారికి చదువుని మాన్పిస్తున్నారన్నారు. ఇప్పటికైనాజీఓను ఉపసంరించుకొని ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలన్నారు.
అనంతరం కలెక్టర్ జి.వీరపాండియన్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హరోద్యరాజు, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి, ఏపీటీఎఫ్ 1938 అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి రవీంద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు సుధాకర్‌బాబు, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.