
కొల్లాపూర్‌లో నక్సలైట్ల లేఖ కలకలం
► ఛత్తీస్‌గఢ్ శాఖ పేరుతో కాంగ్రెస్ నాయకుడు బండి వెంకట్‌రెడ్డికి బెదిరింపు
► రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్
కొల్లాపూర్ : కొల్లాపూర్‌లో నక్సలైట్ల పేరుతో వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడు బండి వెంకట్‌రెడ్డికి ఛత్తీస్‌గఢ్ శాఖ నక్సలైట్ల పేరుతో బుధవారం బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖను ఆయన స్థానిక పోలీసులకు అందజేశారు. జూన్ 1వ తేదీన రాసినట్లుగా ఉన్న ఈలేఖలో రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ కుటుంబానికి చెందిన 5గురి పేర్లను లేఖలో ప్రస్తావించారు. లేఖ ముట్టిన వెంటనే వారిద్వారా డబ్బులను తమకు పంపించాలని సూచించారు. డబ్బులు పంపకుంటే మీ ఇంటిపై బాంబులు వేస్తాం. నిన్ను కిడ్నాప్‌చేసి కాల్చి చంపుతాం అని హెచ్చరికలు చేశారు.
ఏడాది క్రితం ఇదే తీరున పట్టణంలోని ఓ వైద్యుడు, మరికొందరు వ్యాపారులకు కూడా వీపనగండ్ల మండలానికి చెందిన మాజీ నక్సలైట్ పేరున లేఖలు వచ్చాయి. ఈ లేఖలన్నీ పోస్టుల ద్వారా అందాయి. ఒకప్పుడు నక్సల్స్‌కు అడ్డాగా ఉన్న కొల్లాపూర్ ప్రాంతం ఇప్పుడు అందుకు భిన్నంగా మారింది. చాలారోజుల తర్వాత వరుసగా వస్తున్న లేఖలపై పోలీసులు కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే బండి వెంకటరెడ్డికి వచ్చిన లేఖపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ.మనోజ్‌కుమార్ వెల్లడించారు.