ఇక పక్కాగా ఓటరు లెక్క
►త్వరలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం
►ఇప్పటికే బీఎల్‌ఓలకు ట్యాబ్‌ల అందజేత
►ఇంటి నంబర్‌తో ఓటర్లకు జియోట్యాగ్
►అక్కడే తప్పుల సవరణ..
►కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ రూరల్: ఓటరు లెక్క.. పక్కాగా తేలనుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఓటర్లును గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. త్వరలో ఇంటెన్సీవ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓ)కు ట్యాబ్‌లను అందజేశారు. ఇటీవల వీరికి శిక్షణ సైతం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా తొలుత అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాత రూరల్ ప్రాంతాల్లో చేపట్టేలా కార్యచరణ రూపొందించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, జనగాం జిల్లాలోని ఘన్‌పూర్(స్టేషన్) తొలి విడతలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. మొదట సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి నంబర్ అనుసంధానం చేసి జియో ట్యాగ్ చేయనున్నారు. ఓటరు జాబితలో తప్పులు ఉంటే సవరించనున్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీయువకుల నుంచి ఓటరు దరఖాస్తులు స్వీకరించి.. ఓటు హక్కు కల్పించనున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ..
బీఎల్‌ఓలు ఓటరు ఇంటికి వెళ్లిన సమయం.. ఎవరి దగ్గర వివరాలు సేకరించారు.. వంటి అంశాలను ఆన్‌లైన్‌లో వెంట వెంటనే అప్‌డేట్ చేయనున్నారు. ఇది వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓరల్‌గా సమాచారం సేకరించే వారు. ఇంట్లో లేరని తెలియడంతో వెంటనే ఆ ఓటును తొలగించేవారు. ఇలా ఓట్లు తొలగింపు జాతీయ ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారింది. ఓట్లు ఎందుకు తొలగించారు అని కోర్టుకు వెళ్లిన సంఘటనలు సైతం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని నిరోదించేందుకు.. పక్కాగా ఓటరు లెక్క ఉండేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని చేయనున్నారు. ఒకరికి రెండు ఓట్లు.. వివహామై ఆ ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతుల పేర్లను తొలగించనున్నారు.
కొనసాగుతున్న ఓటరు నమోదు
జిల్లాల పునర్విభజన తర్వాత ఓటు హక్కును కల్పించేందుకు చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్లునిండిన యువతీయువకులను గుర్తించేందుకు గతంలో సర్వే నిర్వహించారు. బీఎల్‌ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు, కారోబార్లు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు బూత్ లెవల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు