పెద్ద నోట్ల రద్దుపై నిరసన
అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు
పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు దహనం
నిజామాబాద్ : పెద్ద నోట్ల చెలామణి రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగారుు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ వంటి పట్టణాలతోపాటు పలు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగారుు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల నేతలు కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగారుు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) తదితర పార్టీలు, అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని స్థానిక గాంధీచౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నిజాంసాగర్ కాలువ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. నందిపేట్‌లో బస్టాండ్ ఎదుట ర్యాలీ, ధర్నా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మాక్లూర్ మండలంలో సీపీఎం(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, మోదీ బొమ్మను దగ్ధం చేసారు.
బోధన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వర్ని మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్ష నేతలు ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కోటగిరి మండలంలో ర్యాలీ జరిగింది. డిచ్‌పల్లిలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో, సిరికొండలో న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. మోర్తాడ్‌లో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో 64వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.