ఆ అధికారి రూటే సపరేటు
కడప రూరల్:
జిల్లా ఔషధ నియంత్రణ శాఖలో ఒక పర్యవేక్షణ అధికారి తీరు మెడికల్ షాపుల యజమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తాను చండశాసనుడిని అంటూనే చేతికి మట్టి అంటకుండా పనులను చక్కదిద్దుకునే పనిలో పడినట్లుగా తెలిసింది. ఆ మేరకు అసోసియేషన్‌కు సంబంధించిన నాయకులు తోడైనట్లు సమాచారం.
వెరిఫికేషన్ పేరుతో..
కడప పరిధిలో హోల్‌సేల్, రీటైల్ చిన్నవి, పెద్దవి మొత్తం కలుపుకుంటే దాదాపు 300 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 30వ తేదీన కడపలో కెమిస్ట్ వెరిఫికేషన్ పోగ్రామ్‌ను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ మేరకు అసోసియేషన్ పేరుతో మెడికల్ షాపుల యజమానులకు పత్రాలను కూడా పంపిణీ చేశారు. ఆ పత్రంలో సమావేశానికి వచ్చేటపుడు మెడికల్ స్టోర్ డేటా ఎంట్రీ ఫారం, లేటెస్ట్ డ్రగ్ లైసెన్స్, ఫార్మసిస్టు సర్టిఫికెట్, ఫార్మసిస్టు పాస్‌బుక్, ప్రొప్రైటర్ ఫార్మసిస్టు ఆధార్‌కార్డు జిరాక్స్‌లతోపాటు రెన్యూవల్, ఫార్మసిస్టు చిరునామా, భాగస్తుల మార్పు, ఒరిజినల్ లైసెన్స్ అప్‌డేట్, పాత డ్రగ్ లైసెన్స్ కాపీలు తదితర వివరాలను పట్టుకు రావాలని పొందుపరిచారు. అంతేకాకుండా ఆ పత్రంలో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఖర్చుల కోసమని ఒక్కో మెడికల్ షాపు నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎవరైనా ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే లొసుగుల పేరుతో వారిని ముప్పుతిప్పులు పెడుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఎందుకొచ్చిన గొడవ అడిగినంత సమర్పించుకుంటే మన జోలికి రారు కదా అనే ధోరణితో సరిపుచ్చుకుంటున్నట్లుగా తెలిసింది.
లొసుగుల పేరుతో..
సాధారణంగా మెడికల్ షాపులు అనగానే కొన్ని లొసుగులు ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మెడికల్ షాపులో యజమాని తర్వాత ఫార్మసిస్టు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫార్మసిస్టులు చాలావరకు మెడికల్ షాపుల్లో లేరనే చెప్పుకోవచ్చు. ఇలాంటివితోపాటు మరికొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని ఆ పర్యవేక్షణ అధికారి అసోసియేషన్ నేతలను అడ్డుపెట్టుకుని తన పని కానిచ్చేయడానికి పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెడికల్ షాపు వర్గాల్లో ఈ అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కడపలో లెక్కకు మించి మెడికల్ షాపులు వెలిశాయి. వ్యాపారాలు జరగక అల్లాడిపోతుంటే మామూళ్లు ఇచ్చుకోలేక అవస్థలు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసోసియేషన్‌కు సంబంధం లేదు
ఈనెల 30న నిర్వహించే కెమిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమానికి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కార్యక్రమాన్ని మా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. అలాగే కార్యక్రమానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలి. మార్పులు, చేర్పులు జరిగినందున వెరిఫికేషన్ కార్యక్రమానికి మెడికల్ షాపుల యజమానులు సహరించాలి.
– ఎంవీఎస్ వరప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ