బాబు పాలన ప్రజా కంటకం
♦ వైఎస్సార్‌సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు
♦ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు ఉధృతం చేస్తాం
♦ త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ప్రజా కంటకంగా తయారైందని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పార్టీ పనితీరుపై జగన్ సమీక్షలు చేపట్టారని, అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం జరిగిందని చెప్పారు.
అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబుపై ఇంకా పోరాటం ఎలా చేయాలి, పార్టీ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా ఎలా నిర్వహించాలన్న దానిపైనే చర్చించామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్నికల అనంతరం పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డీజిల్ ధరలు తగ్గుతూ ఉంటే ఆర్టీసీ చార్జీలు పెంచడమనేది చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వైపు ధనికులు సంచరించే విమానాలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడంతోపాటు భారీగా ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తున్నారని, మరో వైపు పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో పశ్చిమ గోదావరికి జగన్...
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయని, తమ జిల్లాలో పామాయిల్ క్వింటాలు ధర రూ.మూడు వేలకు పడిపోయిందని కొత్తపల్లి తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని జగన్‌ను కోరామన్నారు. కష్టాల్లో ఉన్న పామాయిల్ రైతులకు ధైర్యం చెప్పేందుకు తమ జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరామని, త్వరలో జగన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.