- రోడ్డున పడిన రెండు కుటుంబాలు
పుల్‌కల్: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు కుటుంబాల వారు సైతం కటిక నిరుపేదలు. రోడ్డు ప్రమాదంతో సింగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. సింగూర్‌కు చెందిన కల్లపల్లి శేఖర్(28) తండ్రి కృష్ణ మేకలు కాస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తమ బంధువులను చూసేందుకు బైక్ పై తన స్నేహితుడితో కలిసి శేఖర్ వెళ్లాడు. ఈ క్రమంలో చిల్వర గ్రామ శివారులో ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో శేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన యాదయ్య గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
మృతుడు శేఖర్ ఒక్కడే కుమారుడు. తనకు తలకొర్వి పెడతాడనుకున్న కొడుకు తన ముందే చనిపోతే తాము బతికేది ఎలా అంటూ అతని తల్లిదండ్రులు రోదించడం అందరి కంటా కన్నీరు పెట్టించింది. ఇది ఇలా ఉంటే ఇదే ప్రమాదంలో గాయపడిన యాదయ్య పరిస్థితి మరీ దారణంగా ఉంది. అతడి తండ్రి మొగులయ్యకు రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. దీంతో తల్లి సత్తమ్మపైనే కుటుంబం ఆధారపడింది. అంతలోనే తన కుమార్తెకు గతేడాది సుల్తాన్‌పూర్ చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుమార్తె సైతం ఇంటికి చేరింది.
ఇప్పటికే కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంతలోనే రోడ్డు ప్రమాద సంఘటన వారిపై పెనుభారంగా పరిణమించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాదయ్యను సోమవారం రాత్రి గాంధీకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఆసుపత్రి వైద్యులు సూచించారు. కానీ అంబులున్స్‌కు ఇచ్చేందుకు చిల్లిగవ్వలేని దీనస్థితి వారిది. యాదయ్య స్నేహితులు, నాయకులు తోచిన సహాయం చేయడంతో మంగళవారం ఆసుపత్రికి తరలించారు. కనీసం మందులు కొనలేని తాము హైదరాబాద్‌లో ఎలా ఉండి వైద్యం చేయించాలో తోచడం లేదన్నారు.
ఆదుకుంటేనే బతుకుతాం
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన తమ కుమారుడిని ప్రభుత్వం ఆదుకుంటేనే తాము బతుకుతామని యాదయ్య తల్లి సత్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయం చేసుకునేందుకు గుంట భూమి లేదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తమదన్నారు. ప్రభుత్వం కనికరిస్తేనే తన కుమారుడికి వైద్యం చేయించగలమన్నారు. నాయకులు, అధికారులు స్పదించి వైద్యం, మందులు అందించేందుకు కావాల్సిన సహాయం చేయాలని ఆమె కోరింది.