Published
Sat, Sep 10 2016 8:05 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
యువతను నిర్వీర్యం చేస్తున్న పాలకులు
కోదాడ : యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వీరి అసమర్థ పాలన వల్ల యువశక్తులు నిర్వీర్యం అవుతున్నాయని డీవైఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి అభయ్‌ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో జరుగుతున్న డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల్లో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావ్యవస్థను కార్పొరేట్ రంగానికి అప్పగించి సామాన్యులకు అందని వస్తువుగా విద్యను తయారు చేశారని ఆరోపించారు. అందరికి విద్యను అందించాలనే రాజ్యాంగమౌళిక సూత్రాలకు పాలకులు తిలోదకాలు ఇచ్చారన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ వనరులు, యువశక్తులు భారతదేశానికి ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకుంటే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారుతుందన్నారు. స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరిచి పుష్కరాలు, నిమజ్జనాలు, బతుకమ్మ పండుగల అంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనుత్పాదక రంగాలకు ఖర్చు చేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలని యువ శక్తులను సక్రమంగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతతకు మారు పేరుగా ఉండే యూనివర్సిటీల్లో కేంద్ర పాలకులు తమ రాజకీయాలను జొప్పించి అశాంతి నిలయాలుగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న ఢిల్లీలో జరిగే దళిత ర్యాలీలో డీవైఎఫ్‌ఐ పాల్గొంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏ. విజయ్‌కుమార్, కె భాస్కర్, జిల్లా కార్యదర్శి జె. నర్శింహారావు, కుక్కడపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.