హోదా.. మన శ్వాస
కడప రూరల్ :
ప్రత్యేక హోదా రాష్ట్రానికి, మనకు శ్వాస లాంటిదన్నారు. ప్రాణప్రదమైన శ్వాసలాంటి హోదాను సాధించాలంటే అన్ని వర్గాల వారు ఏకమై మరో పోరాటానికి సిద్దం కావాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ నాడు రాష్ట్రాన్ని పార్లమెంటులో తలుపులు వేసి అడ్డగోలుగా విభజించారన్నారు.
అప్పుడు కేంద్రంలోని వెంకయ్యనాయుడు తదితరులు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఘంటాపథంగా చెప్పడం జరిగిందన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వత్తాసు పలుకుతూ పది కాదు...పదిహేను సంవత్సరాలపాటు ప్రత్యేక హోదాను కల్పించాలని చెప్పడం జరిగిందన్నారు. ఆ మాటలన్నీ నేడు ఏమయ్యాయని నిలదీశారు. ప్రత్యేక హోదా కాదు....ప్రత్యేక ప్యాకేజీ అని కేంద్రం చెప్పడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తల ఊపడం దారుణమన్నారు. రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి కుటుంబం సొత్తు కాదని, దాదాపు ఐదు కోట్ల మంది ప్రజల హక్కు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం చేపట్టే బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభ్యున్నతి, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. అందులో ఒక్క శాతమైనా పాలకులకు చిత్తశుద్ది లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రై వేటు విద్యా సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, రమణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ హోదా వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, పలు ఉపయోగకరమైన ప్రాజెక్టులు ఏర్పడతాయన్నారు. తద్వారా నిరుద్యోగ సమస్యను రూపుమాపవచ్చన్నారు. అలాంటి హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీ కోసం చేతులు చాచడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టే బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దన్న మాట్లాడుతూ కేంద్రం ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటుందని నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు పాలనను అందించింది మంచి పనులు చేయడానికే తప్పితే ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోమని కాదని హితవు పలికారు.
ప్రజలు ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు జి.భాస్కర్‌రెడ్డి, ఎంపీ సురేష్, బోలా పద్మావతి, ఇలియాస్, కరీముల్లా, షఫీలు మాట్లాడుతూ కేంద్రం ఆడించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడటం తగదన్నారు. హోదా కోసం ముఖ్యమంత్రి ఏనాడూ గళమెత్తకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టే బంద్‌లో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చల్లా రాజశేఖర్, పులి సునీల్‌కుమార్, షఫీ, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.