రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు
Published Tue, Aug 16 2016 6:54 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
డాబాగార్డెన్స్: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్వనాశనం
చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలను కల్లబొల్లిమాటలతో మోసపుచ్చుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి
నెరవేర్చుకోలేని స్థితిలో బాబు ఉన్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే
జోన్ మరచిపోయారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌కు నిధులు రావడం లేదు. ఇలా అన్ని విధాల
చంద్రబాబు విఫలమయ్యారని తెలిపారు. జగదాంబ జంక్షన్ సమీపాన పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో
మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం సాయం చేయడం లేదంటూనే
రాష్ట్రం నంబర్ వన్‌లో ఉందని చెప్పడం ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. దేశంలో
అవినీతి రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని దేశరాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించిన 70వ స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారన్నారు. కానీ నీ భాగస్వామ్య తెలుగుదేశం
ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోతే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అత్యధిక
నిధులిచ్చామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఓ వైపు చెబుతుంటే..మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్ర
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బంధువైన పురంధేశ్వరీ ఈ రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తే చంద్రబాబే
తినేస్తున్నారని బాహాటంగా చెప్పారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో చాటిచెప్పిన
మొనగాడు ఎన్టీ రామారావు అయితే తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని
ఆరోపించారు. అవినీతిలో టాప్ అయితే..అభివద్ధిలో జీరో అని చెప్పారు. అధికారం చేపట్టి మూడో సారి
జాతీయజెండా ఎగురవేసిన చంద్రబాబు ప్రసంగమంతా నిస్సహాయిగానే ఉందన్నారు. కేంద్రం నుంచి
ఒక్క సాయం అందడం లేదని చెబుతున్నప్పటికీ బాబు చేస్తున్న ప్రయత్నాలేవని విమర్శించారు.
రాజధానికి అనుకున్న రీతిలో నిధులు రాకపోయినా బాబూ స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.
చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబని ఆరోపించారు. రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇంత వరకు ఒక
పతకం కూడా రాలేదని చెబుతూ అబద్దాలు..అవినీతిపై ఒలింపిక్స్‌లో పోటీ పెడితే చంద్రబాబుకు
బంగారు పతకం ఖాయమని ఎద్దేవా చేశారు. పరుగుల వీరుడు కోబాల్ట్‌లా..రెండేళ్లలో రెండు లక్షల
కోట్లకు చంద్రబాబు అవినీతి సొమ్ముకు పరుగులెత్తారని విమర్శించారు. హుద్ హుద్ విరాళాలు..
పట్టిసీమ ప్రాజెక్టు..గోదావరి పుష్కరాలు.. ఇంకుడు గుంతలు.. నీరు–మీరు, తాజాగా కృష్ణా పుష్కరాలు
అన్నింటా అవినీతేనని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కంపా హనోక్, బీసీ సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు పక్కి దివాకర్, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ, ప్రచార కమిటీ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి,యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు
బర్కత్ ఆలీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, సేవాదళ్ అధ్యక్షుడు వాసు పాల్గొన్నారు.
Advertisement
Advertisement