దాడి వెనుక ఆ ఇద్దరు ఎస్‌ఐలు?
అనంతపురం శివార్లలోని పాపంపేటలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా ఆమె తల్లిదండ్రులపై జరిగిన దాడి వెనుక ఇద్దరు ఎస్‌ఐల పాత్ర ఉందా? అంటే సంఘటనా స్థలిని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 12న రాత్రి పాపంపేటలో జరిగిన ఘటనకు స్థానిక రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. పాపంపేటలోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో రాజేశ్వరి, చంద్రన్న దంపతులు నివాసముంటున్నారు. వారి కుమార్తె సుష్మా బెంగళూరులో నోబుల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోంది.
సుష్మా కుటుంబానికి, పక్కింటి వారికి ఓ ప్రహారీ నిర్మాణ విషయంలో ఏడాదిన్నర నుంచి వివాదం ఉంది. ఈ విషయంపై బాధితులు చంద్రన్న, రాజేశ్వరి, సుష్మా స్థానిక టూ టౌన్ సీఐ శుభకుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు..కొంతమందిని సీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు. వెంటనే రంగంలోకి ది గిన ఎస్‌ఐలు కొంతమందిని ఉసిగొల్పి సు ష్మాపై దాడి చేయించినట్లు తె లిసింది. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి అవమానించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐపై అనేక ఆరోపణలు వచ్చినా, అతనిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు...
రెండో పట్టణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు రాజేశ్వరి, సుష్మా గురువారం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి పక్కనున్న నారాయణమ్మ, శ్రీకాంత్, హరి, శివప్రసాద్, నలిని, తదితరులు తమ కుమార్తెను వివస్త్రను చేసి అవమానిస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐలతో పాటు సీఐ కలసి తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.