
జీవో 97ను ఉపసంహరించుకోవాలి
♦ మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి డిమాండ్
♦ బాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని
వ్యతిరేకించింది నిజమా? కాదా? అని నిలదీత
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని 1,220 హెక్టార్లభూమిలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జారీచేసిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో జారీ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తూ 2011, డిసెంబర్ 24న అప్పటి గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారని ఆయన గుర్తుచేస్తూ.. ఈ విషయం వాస్తవమో కాదో స్పష్టం చేయాలన్నారు. అధికారంలోకొచ్చాక బాక్సైట్ తవ్వకాలకు అనుమతివ్వటంలోని ఆంతర్యం, గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో మార్పుకు దారితీసిన పరిస్థితులను వివరించాలన్నారు.
బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని అధికారంలోకొచ్చాక అందుకు విరుద్ధంగా జీవో జారీచేయటం ఆత్మవంచనతోపాటు గిరిజనులను వంచించటమేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు.