
పొగాకు వాడకం ప్రమాదకరం
ప్రొద్దుటూరు క్రైం:
పొగాకు వాడకంతో ఏటా లక్షల కుటుంబాలు క్యాన్సర్ బారిన పడుతున్నాయని అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ అరుణసులోచన అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణలో భాగంగా గురువారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పొగాకు ఉత్పత్తుల వాడకం, అలవాట్లు మాన్పించే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొగాకు ఉత్పత్తులు వాడిన కారణంగా ప్రపంచంలో ప్రతి ఏడాది సుమారు 60 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. మన దేశంలో అయితే 10 లక్షల మంది ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. బీడీ, గుట్కా, సిగరెట్‌లకు బానిసలైన వారిని ఇక్కడికి తీసుకొని వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఆస్పత్రులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా ధూమ పానం చేస్తుంటే ధైర్యంగా తాగవద్దని చెప్పాలన్నారు. అవసరమైతే వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ధూమపానం చేసేవారు 40 శాతం మాత్రమే పొగతాగి మిగతా 60 శాతం బయటికి వదులుతున్నారని చెప్పారు. దీనివల్ల పొగతాగని వారు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని వివరించారు. నోడల్ ఆఫీసర్ మహ్మద్‌బాషా మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 100 జిల్లాలు ఈ కార్యక్రమానికి ఎంపిక కాగా అందులో వైఎస్సార్ జిల్లా కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డేవిడ్ సెల్వరాజ్, హెల్త్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగరాజు, వైద్యులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.