తీరు మార్చుకోని ఆర్టీసీ
Published Wed, Jul 20 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
సింహాచలం : ఆర్టీసీ సిబ్బంది తీరు మారలేదు. గతంలో లాగే ఈ సారికూడా టిక్కెట్‌పై అదనపు వసూళ్లకు పాల్పడి గిరి ప్రదక్షిణ భక్తులను దోచుకున్నారు. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి ఉన్న టిక్కెట్టు ధరకన్నా అదనంగా మూడు రూపాయలను మంగళవారం భక్తుల నుంచి వసూలు చేశారు. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి ఆర్టీసి బస్సుల్లో పెద్దలకు 17 రూపాయల టిక్కెట్టు వసూలు చేస్తారు. ఒప్పందం ప్రకారం ఆర్టీసీకి సంబంధించిన 12 రూపాయల టిక్కెట్టు, దేవస్థానంకి చెందిన 5 రూపాయల టిక్కెట్టు బస్సుల్లో విడివిడిగా కండక్టరు ఇస్తాడు. మంగళవారం మాత్రం భక్తుల నుంచి టిక్కెట్టుకు రూ.20లు వసూలు చేశారు. దేవస్థానం టిక్కెట్టు 5 రూపాయలు తీసేయగా మూడు రూపాయలను అధికంగా వసూలు చేశారు. కొన్ని సందర్భాల్లో అసలు దేవస్థానం టిక్కెట్టు ఇవ్వకుండానే మొత్తం టిక్కెట్టు ఆర్టీసీదే ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. పై విషయాలను పలువురు భక్తులు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సిబ్బంది దష్టికి తీసుకురాగా వారు ఈవో కె.రామచంద్రమోహన్ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఈవో సింహాచలం డిపో మేనేజర్ దివ్యతో ఫోన్‌లో సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది కూడా భక్తుల నుంచి ఆర్టీసీ సిబ్బంది అధిక వసూళ్లకు పాల్పడితే దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సిబ్బందే పట్టుకున్నారు. బస్సులను కొండపైకి వెళ్లనీయలేదు. అయినా ఈ ఏడాది కూడా వారి తీరు మారలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement