గుత్తిలో కలకలం
ఇంట్లోకి చొరబడ్డ దుండగులు..
వివాహిత మెడపై కత్తిపెట్టి నగలు దోపిడీ
అడ్డుకోబోయిన ఇంటి యజమాని హత్య
గుత్తిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి తెగబడ్డారు. వివాహితను గదిలో బంధించి ఆమె మెడపై కత్తి పెట్టి నగలు దోచుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇంటి యజమాని అయిన జీపు డ్రైవర్‌ను డంబెల్‌తో తలపై మోది హతమార్చారు. రూ.5లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు.
గుత్తి: గుత్తి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జీపు డ్రైవర్ హత్యను చేసి, ఆయన భార్యను కత్తితో బెదిరించి నగలు, నగదుతో ఉడాయించారు. సీఐ ప్రభాకర్‌గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుమ్మర వీధిలోని కుక్కల బావి సమీపాన బలిజ సుధాకర్(30), వెంకటేశ్వరిలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రామ్‌చరణ్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుధాకర్ సొంతంగా టాటా సుమో (జీపు) పెట్టుకుని బాడుగలకు తిప్పుతూ జీవనం సాగించేవాడు. శుక్రవారం కూడా బాడుగలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మిద్దెమీద నుంచి లోపలికి ప్రవేశించారు.
అలికిడి విని అప్రమత్తమైన సుధాకర్ వారిపై తిరగబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు సుధాకర్‌పై దాడి చేస్తుండగా.. మరొక వ్యక్తి భార్య వెంకటేశ్వరిని పక్క గదిలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ కట్టి బంధించాడు. ఆమె మెడపై కత్తి పెట్టి బంగారు లాంగ్ చైన్, తాళిబొట్టు, ఉంగరాలు, కమ్మలు లాక్కున్నారు. తర్వాత సుధాకర్‌పై నలుగురు కలిసీ దాడి చేశారు. ఎదురుదాడికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న డంబెల్ తీసుకుని తల వెనుక బలంగా మోదారు. దీంతో సుధాకర్ గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బీరువాను తెరిచి అందులో ఉన్న రూ. 5 లక్షల నగదు, 30 తులాల విలువైన బంగారు ఆభరణాలు (లాంగ్ చైన్లు, కమ్మలు , ఉంగరాలు, వడ్డాణం) ఎత్తుకెళ్లారు. దొంగలు వెళ్లిపోయాక వెంకటేశ్వరి కట్లు విప్పుకుని గదిలో నుంచి బయటకు వచ్చింది.
రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. ‘నా భర్తను చంపేశారం’టూ గట్టిగా అరిచింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఏఎస్‌ఐ ప్రభుదాస్, హెడ్ కానిస్టేబుళ్లు చెన్నమయ్య, నాగరాజు, కుమార్, ఐడీ పార్టీ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు.
డాగ్, క్లూస్ టీమ్‌ల పరిశీలన
బలిజ సుధాకర్ హత్య జరిగిన ఇంటిని అనంతపురానికి చెందిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. క్లూస్ టీమ్ నిపుణులు హత్యకు వినియోగించిన డంబెల్, గోడపై పడిన రక్తపు మరకలు, బీరువా, తలుపులపై ఉన్న వేలి ముద్రలను పరిశీలించారు. డాగ్ మొదటి ఇంటిలోకి ప్రవేశించి తర్వాత మిద్దె ఎక్కింది. తర్వాత కిందకు దిగి ఇంటికి ఎడమ పక్కకు పరుగుతీసింది. అటు తర్వాత కొంత దూరంలో ఉన్న బారే హిమామ్ పీర్ల మకాన్ వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. తిరిగి సుధాకర్‌ను హత్య చేసిన ప్రాంతానికి చేరుకుంది.
నిందితులను పట్టుకుంటాం : డీఎస్పీ
హత్య సమాచారం తెలియగానే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి శనివారం గుత్తికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. నలుగురు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి డంబెల్‌తో తలపై మోది హత్య చేశారన్నారు. త్వరలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
హత్యపై అనుమానాలు
జీపు డ్రైవర్ సుధాకర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వెంకటేశ్వరి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి తనను బంధించి భర్త సుధాకర్‌ను హత్య చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. నిజంగా దొంగలే అయి ఉంటే సుధాకర్‌తో పాటు వెంకటేశ్వరిని కూడా హతమార్చేవారు. బంధీగా ఉన్న ఆమె ఎలా తప్పించుకుని బయటకు వచ్చిందో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటిలోనే కాసేపు తిరిగింది. సుధాకర్ హత్య చేయబడిన గదిలోకి, వంట గదిలోకి రెండు సార్లు డాగ్ వెళ్లింది. దీంతో కొత్తవారు ఇంటిలోకి ప్రవేశించలేదని తేటతెల్లమవుతోంది. ఒక వేళ దొంగలు వచ్చి ఉంటే బీరువా ఉన్న గదిలోకి వెళ్లకుండా వంటగదిలోకి ఎందుకు వెళతారు అనే సందేహం కలుగుతోంది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.