గాంధీనగర్లో దొంగలు పడ్డారు
-
మూడిళ్లలో చోరీ.. కొన్ని వస్తువులు మరో ఇంట్లో మరిచిన వైనం
-
అనుమానితుల్ని విచారిస్తున్న పోలీసులు
బుచ్చిరెడ్డిపాళెం : పట్టణంలోని గాంధీనగర్లో శనివారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక గాంధీనగర్లో తొలుత సాయిబాబా గుడి పక్కనున్న ఏటూరి శ్రీనివాసులు ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. బీరువా తాళాలు పగలగొట్టి Ðఅందులోని ఒక జత కమ్మలు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ఒక కవర్లో పెట్టుకున్నారు. అక్కడ నుంచి వీరారెడ్డి ఇంట్లోకి వెళ్లి ప్రవేశించి బీరువాను పగలగొట్టారు. బీరువాలోని 8.4 సవర్ల బంగారు, కిలో వెండి ఆభరణాలను అపహరించారు. ఏటూరి శ్రీనివాసులు ఇంట్లో అపహరించిన వస్తువుల కవర్‌ను వీరారెడ్డి ఇంట్లో కుర్చీలో పెట్టి మరచిపోయారు. అక్కడ నుంచి రమేష్‌రెడ్డి ఇంటి కింది పోర్షన్ తలుపులు పగలగొట్టారు. అలికిడికి పైన పడుకుని ఉన్న రమేష్‌రెడ్డి కిందికి వచ్చాడు. దీంతో దొంగలు పరారీ అయ్యారు. దొంగల కలకలంతో స్థానికులందరూ గుమికూడారు. మూడిళ్లలో దొంగలు పడ్డారని నిర్ధారణకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది.
పక్కా ప్రణాళికతోనే..
దొంగలు పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దొంగతనం చేశారు. ఏటూరి శ్రీనివాసులు కుటుంబం వివాహానికి వెళ్లింది. వీరారెడ్డి కుటుంబం నెల్లూరుకు వెళ్లి తిరిగి బుచ్చిరెడ్డిపాళెనికి చేరుకుని బంధువైన రమేష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. రమేష్‌రెడ్డి ఇంటి కింద గదిలో బాడుగకు ఉన్న వ్యక్తులు శుభకార్యానికి వెళ్లారు.
ప్రొఫెషనల్ దొంగల పనే
గాంధీనగర్లో మూడిళ్లలో జరిగిన దొంగతనాన్ని చూస్తే ప్రొఫెషనల్ దొంగల పనిగా తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో పలు దొంగతనాల్లో ప్రమేయమున్న వ్యక్తుల పనేనని అంటున్నారు. అయితే ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పని కాదని, ఒక్కడే ఉంటాడని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.