ధర్మపురిలో పట్టపగలే భారీ చోరీ
ధర్మపురిలో పట్టపగలే భారీ చోరీ
Published Thu, Sep 15 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
ధర్మపురి :పట్టణంలో దొంగలు గురువారం పట్టపగలే భారీ చోరీకి తెగబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనమైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గుండయ్యపల్లె సమీపంలో సీపతి రాజన్న నివాసముంటున్నాడు. ఇంటి సమీపంలోనే కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం రాజన్న షాపుకు వెళ్లాడు. అతడి భార్య సంధ్యారాణి ఇంటికి తాళం వేసి పక్కింట్లో గణపతికి భోగం వండేందుకు వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. బీరువా తాళం పగులగొట్టి అందులోని బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అరగంట తర్వాత సంధారాణి ఇంటికి రాగా, తాళం పగిలి ఉంది. అనుమానంతో లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని నగలు, నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి బోరున విలపించింది. స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వేలిముద్రలు సేకరించారు. ఇంటి ముందు గేటు వేసి ఉండగానే గోడ ఎక్కి దొంగలు లోనికి వెళ్లిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement