తాళం వేసిన ఉన్న ఇళ్లలో చోరీ
-
బాపూజి నగర్‌లో రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ ఇంట్లో ఒకటి
-
పాతవూరు హైమావతమ్మ మిల్లు వీధిలో మరొకటి
-
వరుస దొంగతనాలపై ఎమ్మెల్యే ఆరా
కావలిరూరల్ : పట్టణంలో రెండు దొంగతనాలు జరగడంతో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలు..రిటైర్డ్ పోస్టుమాస్టర్ షేక్ కాలేషా పట్టణంలోని బాపూజి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంభసభ్యులతో కలిసి ఈ నెల 17న మదనపల్లికి వెళ్లాడు. సోమవారం రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. లోపల బీరువా పగులగొట్టి ఉంది. బీరువాలో బట్టలు, అలమరాలో వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారమందించగా 2టౌన్ ఎస్సై అన్వర్‌బాషా సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో మూడున్నర సవర్ల బంగారం, రెండు వెండి గ్లాసులు, ఒక స్మార్ట్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. నెల్లూరు నుంచి క్లూస్‌టీం వచ్చి పరిశీలించి ఆధారాలు సేకరించారు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలు, ఇళ్లమధ్యలో
పట్టణంలోని పాతవూరు హైమావతమ్మ రైస్‌మిల్లు వీధిలోని సాయినాథ స్కూలు పక్కన సందులో ఉన్న లక్ష్మీ కాంతమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు. ఉదయం 11 గంటలకు పశువులను తోలుకొని పొలం వెళ్లి తిరిగి సాయంత్రం ఐదుగంటలకు ఇంటికి వచ్చిన లక్ష్మీకాంతమ్మ ఇంటి తలుపు రెండుముక్కలై ఉండడం చూసి షాక్‌కు గురయింది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా ఒకటో పట్టణ సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సైలు నాగరాజు, అంకమ్మ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనలో బీరువా పగులకొట్టి అందులో ఉన్న లక్షా ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదు, రెండు సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలు తెలిపింది. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ విషయం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి తెలియడంతో వెంటనే పాతవూరులోని నలగర్ల లక్ష్మీకాంతమ్మ నివాసానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న ఎస్సైలు గుంజి నాగరాజు, అంకమ్మలతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, జనిగర్ల మహేంద్ర, మునిసిపల్ వైస్ చైర్మన్ జి.భరత్‌కుమార్, కౌన్సిలర్ శివప్రసాద్, పరుసు మాల్యాద్రి, ఉప్పాల శ్రీనివాసులు, సుగుణకుమార్‌రెడ్డి, కలికి శ్రీహరిరెడ్డి తదితరులు ఉన్నారు.