వెంకన్న ఆలయంలో చోరీ
- తాళాలు పగులగొట్టి హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు
రొళ్ల : మండల పరిధిలోని కొత్తపాళ్యం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆలయ అర్చకుడు, దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజు సోదరుడు ప్రకాష్ ఆలయ తాళాలను తెరచి చూడగా ఉత్తరద్వారం వైపున ఉన్న వాకిలి తాళాలను పగులగొట్టి పెద్ద హుండీని ఆలయ వెనుకభాగంలోకి తీసుకెళ్లారు. శ్రీదేవి, గోదాదేవి ఆలయాల్లో తాళాలు పగులగొట్టి హుండీలను సమీపంలోని పొలాల్లోకి విసిరేశారు.
సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో ఎస్‌ఐ నాగన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అనంతపురం నుంచి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.2.80లక్షల వరకు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి దాకాహుండీ తాళాలు తెరవలేదన్నారు. ఆ మొత్తాన్ని అపరించుకుని వెళ్లారన్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు సోదరుడు ప్రకాష్ రూ.40వేలు చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.