
సొంతింటి కోసం దొంగతనం బాట
సాక్షి, హైదరాబాద్: అతడు ఓ సొంతిల్లు కట్టుకోవాలనుకున్నాడు.. ఆ కల ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకున్నాడు.. అందుకోసం పశువులను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు.. ఇంతకీ ఎవరా దొంగ.. ఏంటా కథ..! ఓ లుక్కేద్దాం..
హరియాణాకు చెందిన నవాబ్.. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. బీఫ్ అమ్ముతూ.. జీవనం సాగిస్తున్నాడు. సొంతిల్లు కలను నెరవేర్చుకునేందుకు దొంగతనాల బాట పట్టాడు. అయితే అందరు దొంగల్లా డబ్బు, నగలు దొంగిలించేవాడు కాదు. కేవలం పశువులను దొంగిలించేవాడు. ఇందుకోసం మూడు గ్యాంగ్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారి సాయంతో దొంగిలించిన ఆవులు, ఎద్దులు, దూడలు, బర్రెలను కబేళాలకు, కంపెనీలకు విక్రయించేవాడు. అలా అలా కొన్నాళ్లకు ఇల్లు కొనేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకున్నాడు. మధ్యవర్తికి రూ.5 లక్షలు కూడా చెల్లించాడు. పశువులను తరలించేందుకు వీలుగా ఓ కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు తన గ్యాంగ్ సభ్యులకు రూ.7.45 లక్షలు ఇచ్చాడు. అయితే నవాబ్ సొంతింటి కల నెరవేరకుండానే తన గ్యాంగ్‌తో పాటు పోలీసులకు చిక్కాడు.
విచారణలో వెల్లడైన నిజాలు..
విచారణలో భాగంగా తాను చేసిన దొంగతనాల వివరాలు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. దీంతో నవాబ్, తన గ్యాంగ్ సభ్యులపై మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీరికి కింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు దొంగతనాన్ని అలవాటుగా చేసుకున్నారని, దీంతో వారికి బెయిల్ ఇస్తే తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో పశువులను దొంగిలించి పేద రైతులను జీవనాధారం లేకుండా చేశారని పేర్కొన్నారు. దొంగిలించిన పశువులను కబేళాలకు విక్రయించడమే కాకుండా, ఆ మాంసాన్ని తిరిగి తన దుకాణంలోనే విక్రయించే వాడని కోర్టుకు నివేదించారు. దాదాపు 187 ఆవులు, ఎద్దులు, దూడలు, గేదెలను దొంగిలించి అమ్మేశారని పేర్కొన్నారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నిందితుల పిటిషన్లు కొట్టేశారు.