భూముల పంపిణీ లేదు
భూముల పంపిణీ లేదు
Published Tue, Jul 18 2017 12:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
’మీ కోసం’లో కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఎక్కడా ఎవరికీ ఏ విధమైన భూములు పంపిణీ చేయడం లేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. భూములు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం నమ్మవద్దని స్పష్టం చేశారు.
దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గందిపోం యేసమ్మ, బల్లె స్వరూప, తమిర్చి రాధ, తమర్షి వెంకాయమ్మ, కూనపాం దుర్గ మరికొంత మంది మహిళలు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ తమకు గ్రామంలో సీలింగు భూములు పంపిణీ చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ ఎవరికీ ఎక్కడా ఏ విధమైన భూములు పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఏలూరు తంగెళ్లమూడి పంచాయతీలోని రాజరాజేశ్వరినగర్‌లో చెత్తాచెదారం, డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడం, మురుగునీరు నిల్వ ఉండటం వల్ల విపరీతమైన దోమలు, పందులతో ప్రజలు చాలాఇబ్బందులు పడుతున్నారని, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నాగేశ్వరరావు అనే వ్యక్తి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇది సీజనల్ వ్యాధులు వచ్చే కాలం, పారిశుద్ధ్యం లోపించి జిల్లాలో ఎక్కడైనా వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురైతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వెంటనే స్వయంగా వెళ్లి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు.
కొయ్యలగూడెం మండలం గౌరవంలో పొలం వెళ్లే దారిలో నిర్మించిన కల్వర్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నల్ల నాగమల్లేశ్వరరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
టి.నరసాపురం మండలం తిరుమలదేవంలో ఆర్‌అండ్‌బీ రహదారి ఇరువైపులా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని పాకలు వేయడం వల్ల గ్రామంలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గార్లపాటి దుర్గాగాయత్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ హనుమాన్‌నగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలంలో లిక్కర్ షాపు పెట్టారని, దానిని వెంటనే తొలగించాలని ఐ.రవీంద్రనా«థ్, సత్యనారాయణ మరికొంతమంది కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
’మీ కోసం’లో వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేసి సమస్యలు పరిష్కరించి తనకు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ పి.కోటేశ్వరరావు, జేసీ2 ఎంహెచ్.షరీఫ్, డీఆర్‌ఓ కె.హైమావతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కె.శంకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల పాల్గొన్నారు.
Advertisement
Advertisement