
నాపై దాడి చేసి.. ఏకవచనంతో తిట్టారు
చెరువు కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనపై టీడీపీ సర్పంచ్ రమణారెడ్డి దాడిచేసి, నానా దుర్భాషలు ఆడారని చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు ఎమ్మార్వో నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తనపై టీడీపీ సర్పంచ్ రమణారెడ్డి దాడిచేసి, నానా దుర్భాషలు ఆడారని చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు ఎమ్మార్వో నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కలెక్టర్ ఆదేశాల మేరకే అక్కడకు వెళ్లానని, అయితే అక్కడ తనకు తీరని అవమానం జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఫిర్యాదు చేశానన్నారు.
ప్రజాప్రతినిధిగా ఆయన సక్రమంగా ఉండాలని, తమ పని తాము సక్రమంగా చేసేలా అడ్డు లేకుండా ఉంటే చాలని ఆమె తెలిపారు. అదే తాము ఏదైనా తప్పుచేస్తే అడగొచ్చని.. అంతే తప్ప లేనిపోని అభియోగాలు మోపి మానసికంగా చిత్రహింసలు చేయడం మాత్రం సరికాదని తహసీల్దార్ నారాయణమ్మ అన్నారు. తాము మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని, ప్రజలకు ఏం కావాలో అది చేస్తామని, మనస్సాక్షిని బట్టే పనిచేస్తామని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు పేదింటి పిల్లనేనని, అందుకే వాళ్ల మేలు కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తన వెనక తమ సంఘం వాళ్లు ఉండబట్టే ధైర్యంగా ఉన్నానన్నారు.