వ్యసనాలకు బానిసై చోరీల బాట
-
నిందితుడు అరెస్ట్
-
రూ.2.60 లక్షల సొత్తు స్వాధీనం
నెల్లూరు (క్రైమ్) : చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు చోరీల బాటపట్టాడు. ఆదివారం పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. నెల్లూరు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం. బాలసుందరం నిందితుడి వివరాలను వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహుల్ అలియాస్ రోహిత్ అలియాస్ పీపాలు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై చోరీల బాట పట్టాడు. తొలుత సెల్‌ఫోన్లు దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు. 2013లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కి తిరుపతిలోని జువైనల్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి కావలి, నెల్లూరు రెండో నగర పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు చేసి జిల్లా కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవించారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన షాహూల్ ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన గాంధీనగర్ సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో ఎస్‌కే యూసఫ్ ఇంట్లో దొంగతనం చేశాడు. అతని కదలికలపై సీసీఎస్, ఐదోనగర పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా తిరుగుతున్న షాహుల్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేన్‌కు తరలించారు. అతన్ని తమదైన శైలిలో విచారించగా యూసఫ్ ఇంట్లో దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రూ. 2.60 లక్షలు విలువ చేసే 13 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషిచేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, బాజీజాన్‌సైదా, ఐదోనగర ఎస్‌ఐ జగత్‌సింగ్, సిబ్బంది రమేష్, భాస్కర్, సుధా, రాజేష్ తదితరులను డిఎస్పీ అభినందించారు. ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు డిఎస్పీ తెలిపారు.