
దొంగతనానికి వచ్చి వాళ్లే లాస్...
చిన్న దొంగతనానికి వచ్చి పెద్దగా లాస్ అయ్యారు రాజేంద్రనగర్కు చెందిన దొంగలు.
సాక్షి,సిటీబ్యూరో: రాజేంద్రనగర్‌లోని మొఘల్‌కా నాలా, విజయ్‌నగర్ కాలనీలకు చెందిన మహ్మద్ ఫాజిల్ (లైట్ మెకానిక్), మహ్మద్ షోబ్ (ఆటోడ్రైవర్) బంధువులు. వీరికి ఎంఎం పహాడ్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ జహీర్ చిన్ననాటి స్నేహితుడు. హైదర్‌గూడకు చెందిన షకీల్ ఈ ముగ్గురికీ కామన్ ఫ్రెండ్ కావడంతో తరచుగా అతడి ఇంటికి వెళ్లి కలిసేవారు. షకీల్ ఇంటి సమీపంలో ఓ టీవీ షోరూమ్ గోడౌన్ ఉంది. ఈ ముగ్గురి కళ్లూ అందులోని సొత్తుపై పడ్డాయి.
ఆ గోదామును కొల్లగొట్టి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. రెక్కీ పూర్తి చేసుకున్న చోర మిత్రులు.. ఈనెల 22 అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించుకున్నారు. చోరీ చేసిన సొత్తు ఎత్తుకు పోవడానికి ఓ కారు ఉండే బాగుంటుందని భావించారు. ముగ్గురిలో ఒకడైన జహీర్‌కు 2015లో ఆసిఫ్‌నగర్‌లో బైక్ చోరీ చేసిన అనుభవం ఉండడంతో అతడే ముఠాకు నేతృత్వం వహించాడు.
వాహనాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను మిగిలిన ఇద్దరూ షోబ్‌కు అప్పగించారు. దీంతో ఇతగాడు తన సోదరుడికి చెందిన కారును తీసుకుని మిగిలిన ఇద్దరినీ ఎక్కించుకున్నాడు. ఆ గోదాము వద్దకు వెళ్లిన ఈ త్రయం దాని తాళాలు పగులకొట్టి అందులోని 25 ఎల్‌ఈడీ టీవీలను ఎత్తుకు పోయింది. వీటిని విక్రయించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించగా..
సమాచారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అందింది. ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం వలపన్ని పరారీలో ఉన్న షోబ్ మినహా మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేసింది. వీరి నుంచి చోరీ సొత్తు టీవీలతో పాటు చోరీకి వినియోగించిన కారునూ రికవరీ చేశారు. ఆ ఎల్‌ఈడీ టీవీల విలువ రూ.3 లక్షలు కాగా.. కారు విలువ రూ.4 లక్షలు కావడంతో ‘చోర ద్వయానికి’ చుక్కలు కనిపించాయి. ఇక్కడికే రూ.లక్ష నష్టం రాగా.. భవిష్యత్తులో బెయిల్ ఖర్చులు, శిక్ష ‘బోనస్’గా మారనన్నాయి.