
అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న భక్తులు
నగరి: పట్టణ పరిధి చింతలపట్టెడలో నిర్వహిస్తున్న ద్రౌపదమ్మ తిరునాళ్లలో భాగంగా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించా. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటా పండుగ వాతావరణం కనిపించింది. వీధులకు వేపాకు తోరణాలు కట్టారు. ద్రౌపదమ్మ ఆలయం వద్ద అమ్మవారి పాటలు మార్మోగాయి. ఆలయ ఆవరణలో దుర్యోధన వధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 40 అడుగుల పొడవుతో తయారు చేసిన దుర్యోధన, దుశ్శాశన ప్రతిమలు భక్తులను అలరించాయి. మహిళలు ఆ ప్రతిమల వద్ద పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ద్రౌపదీ, ధర్మరాజ దేవుళ్లను, అలుగును దర్శించుకున్నారు. నిర్వాహకులు నటరాజన్ భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. చెన్నై నుంచి తెప్పించిన వివిధ రకాల భారీ రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలు చిన్నారులను, మహిళలను అలరించాయి. కేరింతలు కొడుతూ వారు ఆనందంతో గడిపారు. రాత్రి ఆలయ సమీపంలో కంకణాలు ధరించిన భక్తులు పసుపు దుస్తులు ధరించి మంగళస్నానాలు చేసి అగ్నిగుండ ప్రవేశం చేశారు. చైర్‌పర్సన్ కె.శాంతి, మాజీ చైర్మన్ కే.జే.కుమార్, వైస్‌చైర్‌పర్సన్ పీజీ నీలమేఘం తదితరులు అమ్మ వారిని దర్శించుకున్నారు. తిరనాళ్లకు వేలసంఖ్యలో జనం హాజరవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు, చోరీలు జరగకుండా సీఐ మల్లికార్జున గుప్తా, ఎస్‌ఐ విక్రమ్ భద్రతా చర్యలు చేపట్టారు.
చెల్లియమ్మ ఆలయంలో పాలకుండల ఉత్సవాలు
మున్సిపల్ పరిధి కరకంఠాపురం గ్రామంలోని చెల్లియమ్మ ఆలయంలో ఆదివారం పాలకుండల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గ్రామస్తులు పాలకుండలతో ఊరేగింపుగా వచ్చి గ్రామ దేవత చెల్లియమ్మకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.