రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్‌కుమార్!
-
పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం
న్యూశాయంపేట : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట సంపత్‌కుమార్ మూడోసారి ఎన్నికవనున్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, కోశాధికారిగా దుబ్బ రమేష్ ఎన్నికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది. కాగా, సోమవారం తోట సంపత్‌కుమార్ ప్యానల్ హంటర్‌రోడ్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించింది. నామినేషన్ల స్వీకరణకు సోమవారం 4 గంటల వరకు అవకాశం ఉండగా, మూడు పదవులకు ముగ్గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న తోట సంపత్‌కుమార్ పేరును బుద్ధా ప్రభాకర్‌రావు, తోట సాంబయ్య ప్రతిపాదించారు. ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్న ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు పేరును చిదురాల వేణుగోపాల్, ఎర్రబెల్లి రాంగోపాల్‌రావు ప్రతిపాదించారు. కోశాధికారిగా పోటీ చేసిన దుబ్బ రమేష్ పేరును టి.యుగంధర్, కృష్ణమూర్తి ప్రతిపాదించారు. అసోసియేషన్ ఎన్నికల కోసం గత నెల 27న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 2,3 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గత బుధవారంతో గడువు ముగిసింది. ఈనెల 8న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పోటీలో ఎవరూ లేకపోవడంతో తోట సంపత్‌కుమార్ ప్యానల్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం(ఈనెల 5న) అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.రాజగోపాల్‌రావు తెలిపారు. మిగతా గవర్నింగ్ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు.
రైస్‌మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా : సంపత్
రైస్ మిల్లర్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తోట సంపత్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అందరి సహకారంతో అసోసియేషన్‌ను ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది వెంకట్‌నారాయణగౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు దేవునూరి అంజయ్య, గోనె రవీందర్, మాధవ శంకర్ ప్రభాకర్, తోట చంద్రయ్య, ఇరుకుల్ల రమేష్ పాల్గొన్నారు.
డబ్ల్యూజీఎల్ 401 : నామినేషన్లు పత్రాలు అందజేస్తున్న తోట సంపత్‌కుమార్, తదితరులు