6 నెలల్లో వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ
► మరో వెయ్యేళ్లు నిలిచేలా వేయిస్తంభాల గుడిని నిర్మిస్తున్నామన్న కేంద్ర పురావస్తు శాఖ
► పునర్నిర్మాణ పనులు మరో 15 రోజుల్లో తిరిగి షురూ
► ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరుగుతున్న సదస్సులో వెల్లడి
► ఆలయ నిర్మాణ కౌశలం, పునర్నిర్మాణ ప్రక్రియపై అబ్బురపడ్డ విదేశీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్:
ఎనిమిదిన్నర శతాబ్దాల క్రితం నాటి అద్భుత దేవాలయం.. నిర్మాణంలో ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యం.. ఆశ్చర్యపరిచే శాండ్‌బాక్స్ పరిజ్ఞానం.. గుడికి అనుబంధంగా 10 మీటర్ల ఎత్తుతో, 2,500 కళాకృతులతో రాతి దిమ్మెలతో కూడిన నాట్య మండపం.. మనందరికీ తెలిసిన వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రత్యేకతలివి. ఇందులో దెబ్బతిన్న మండపం పునరుద్ధరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను మరో ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) డైరెక్టర్ (కన్జర్వేషన్) రోమెల్ సింగ్ జమ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటివరకు పునరుద్ధరణకు అడ్డంకిగా మారిన నిధుల సమస్యతోపాటు ఇతర అంశాలను అధిగమించినట్టు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న పురావస్తు శాఖ సదస్సులో మంగళవారం ఈ అంశాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థా పకుడు పాండురంగారావు ప్రస్తావించగా.. జమ్వాల్ ధ్రువీకరించారు. 15 రోజుల్లో పనులన్నింటినీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అత్యంత కచ్చితత్వంతో..
కాకతీయ రాజు రుద్రదేవుడి హయాంలో 1163 సంవత్సరం (అంచనా)లో రూపుదిద్దుకున్న ఈ మండపం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలాంటి తేడా లేకుండా అదేరకంగా పునర్నిర్మిస్తున్నట్లు పాండురంగారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో చెదిరిపోకుండా 350 గ్రాన్యులార్ పైల్స్‌ను భూగర్భంలోకి చొప్పించామని, 150 బోరు రంధ్రాల ద్వారా సున్నపు మిశ్రమాన్ని భూపొరల్లోకి పంపి నేల గట్టిపడేలా చేశామ న్నారు. ప్రతి చదరపు మీటరుకు 40 టన్నుల బరువును నిలిపే స్థాయిలో పటుత్వాన్ని పునాదులకు కల్పించి పనులు చేపట్టామన్నారు. రాళ్లను కలిపి ఉంచిన పురాతన ఇనుప పట్టీలు పాడవడంతో.. స్టెయిన్‌లెస్ స్టీలు పట్టీలను వినియోగించామని చెప్పారు.
గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కే అవకాశం!
కనీసం మరో వెయ్యి ఏళ్లS వరకు ఈ మండపం నిలిచి ఉంటుందని పాండురంగారావు భరోసా ఇస్తున్నారు. 1972లో కరువు సంభవించి వరంగల్ పట్టణంలోని చెరువులన్నీ ఎండిపోయినా ఆలయ ప్రాంగణంలోని కోనేరు నిండుగా నీటితో ఉండి ప్రజల దాహార్తి తీర్చిన విషయాన్ని ఆయన సభలో వివరించారు. కాగా.. అత్యంత క్లిష్టమైన నిర్మాణాన్ని విప్పదీసి.. ఎక్కడా సిమెంటు కాంక్రీట్‌ను వాడకుండా సంప్రదాయ డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతి పొడిలాంటి వాటితోనే పునర్నిర్మిస్తున్న ఈ కట్టడం గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకునే అవకాశముందని చెబుతున్నారు. అందువల్ల దీనిని గిన్నిస్ బుక్ వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.