Thousand Pillar Temple
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
వేయి స్తంభాల గుడి విశిష్టత మరియు రహస్యాలు
-
కాకతీయుల వేయి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
-
రామప్ప దేవాలయం ప్రత్యేకతలు ఏమిటి?
-
వేయి స్తంభాల గుడి నంది చరిత్ర మీకు తెలుసా..?
-
కాకతీయుల తర్వాత మళ్లీ ఇప్పుడే!
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఏడు శతాబ్దాల విరామం తర్వాత వేయి స్తంభాల దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న కళ్యాణ మంటపంలో శివపార్వతుల కళ్యాణం జరగబోతోంది. కాకతీయుల హయాం తర్వాత మళ్లీ ఇంతకాలానికి కళ్యాణ మంటపం కళకళలాడబోతోంది. విఖ్యాత వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మంటపం పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో, సెప్టెంబరులో దాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే శివరాత్రి వేడుకలను అందులోనే నిర్వహించాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాలతో రుద్రేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు. ఓవైపు దేవాలయం, దానికి మరోవైపు కళ్యాణమంటపాన్ని అద్భుత శిల్పకళా వైభవంతో రూపొందించారు. కాకతీయుల ఇలవేల్పుగా భాసిల్లిన పరమశివుడికి ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేవి. డెక్కన్ ప్రాంతాన్ని వశం చేసుకునే సమయంలో తుగ్లక్ సేనలు దీన్ని పాక్షికంగా ధ్వంసం చేశాయని చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో కళ్యాణమంటపం పైకప్పు 40 శాతం కూలిపోయింది. దాంతో ఆ శిథిల మంటపంలో ఇక వేడుకలు నిర్వహించటం ఆపేశారు. అంతే.. మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇప్పుడు ఆ మంటపాన్ని పునర్నిర్మించటంతో తిరిగి వేడుకల నిర్వహణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. చివరి దశలో పనులు.. దాదాపు 18 ఏళ్ల క్రితం కళ్యాణ మంటపాన్ని పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో పూర్తిగా విప్పదీశారు. అందులోని రాళ్లకు నంబర్లు వేసి పద్మాక్షి గుట్ట వద్ద ఉంచారు. కానీ పనులు ముందుకు సాగలేదు.మూడేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం దృష్టి సారించి వేగంగా పనుల నిర్వహణ ప్రారంభించింది. ఇప్పుడు ప్రధాన నిర్మాణ పనులు పూర్తికాగా, వారం రోజులుగా పైకప్పు పనులు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ఆ పనులు కొలిక్కి తెచ్చి సెప్టెంబరులో మంటపాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటి క్వారీ నుంచే ఇప్పుడూ రాళ్ల వినియోగం.. హనుమకొండకు చేరువగా ఉన్న అమ్మవారి పేట క్వారీ నుంచి మంటప పునర్నిర్మాణ పనులకు రాళ్లను తెచ్చి వాడుతున్నారు. అప్పట్లో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాలకు ఈ గుట్ట రాయినే వాడేవారు. నాడు రాళ్లను తొలిచేందుకు చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దాదాపు 60 టన్నుల బరువున్న ఓ భారీ బండరాయిని ఇటీవలే మంటపం వద్దకు తరలించారు. దాన్ని పైకప్పుపై అమర్చనున్నారు. ఆ గుండుపై 800 ఏళ్ల కింద తొలిచినప్పటి రంధ్రాల జాడలు ఇంకా ఉండటం విశేషం. అదే రాయి భాగాన్ని ఇప్పుడు మళ్లీ వేయిస్తంభాల కళ్యాణ మంటపానికి వినియోగిస్తుండటం యాదృచ్ఛికం. ఈ మంటపానికి సంబంధించి 163 బీమ్‌లకు గానూ 28 జాడ లేకుండా పోయాయి. కూలిన తర్వాత ప్రజలు వాటి ముక్కలను తరలించుకుపోయారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో ఒక్కోటి 8 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు, 30 టన్నుల బరువుండే 8 బీమ్ల ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. వాటిపై 32 పైకప్పు సల్పలను పరచనున్నారు. ఈ సల్ప రాళ్లు ఒక్కోటి 15 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి. పనుల్లో తమిళనాడు శిల్పులు తమిళనాడుకు చెందిన శివకుమార్ స్థపతి ఆధ్వ ర్యంలో అదే రాష్ట్రానికి చెందిన 28 మంది శిల్పులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్రప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు కాగా, నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి మరో రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆ తర్వాత దాని చుట్టూ సుందరీకరణ, ఇతర పనులకు మిగతావి ఖర్చు చేయనున్నారు. ఏఎస్ఐ తెలంగాణ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్ కుమార్, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అలనాటి శైలికి తేడా రానివ్వం ‘కాకతీయుల కాలంలో ఏ శైలిని వినియోగించారో ఆ శైలికి ఏమాత్రం తేడా రాకుండా రాళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. అలనాటి నిర్మాణం మళ్లీ కళ్ల ముందుంచేందుకు అహరహం శ్రమిస్తున్నాం. ఆగస్టు చివరి నాటికి కళ్యాణ మంటపం సిద్ధమవుతుంది’ –శివకుమార్, స్థపతి -
8 మీటర్లు.. 70 టన్నులు.. వేయి స్తంభాల గుడి ఘన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల ఆధ్యాత్మిక, కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వేయి స్తంభాల దేవాలయం మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకోబోతోంది. ప్రత్యేక ఆకర్షణ అయిన వేయి స్తంభాల నాట్య మండపం పునరి్నర్మాణం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కోటీ 8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 70 టన్నుల బరువైన భారీ రాతి దూలాలను అమర్చే పనులు జరుగుతున్నాయి. మొత్తంగా జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) భావిస్తోంది. 2005లో విప్పదీసి.. వేయి స్తంభాల గుడిలో నాట్య మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని పునరుద్ధరించేందుకు 2005లో విప్పదీశారు. 18 నెలల్లో పునరి్నరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మధ్యలోనే వదిలేశారు. రాళ్లన్నింటికీ నంబర్లు వేసి మరోచోటికి తరలించారు. 2009లో పునర్నిర్మాణ పనులు తిరిగి మొదలైనా.. 80 శాతం పూర్తయ్యాక మళ్లీ ఆగిపోయాయి. ముందస్తు అనుమతి లేకుండా రెండు అద్దె క్రేన్లను వినియోగించారంటూ ఏఎస్ఐ అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపేయటంతో పనులు నిలిచిపోయాయి. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఈ పనులు ఊపందుకున్నాయి. ఏఎస్ఐ ప్రస్తుత సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్.కుమార్, ఆర్కియోలాజికల్ ఇంజనీర్ కృష్ణచైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం, స్తపతి శివకుమార్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి వేగంగా పనులు జరిపిస్తున్నారు. నాలుగు దూలాల కోసం నానా పాట్లు స్తంభాల పునరుద్ధరణ గతంలోనే పూర్తయింది. వాటిపై దూలాలు అమర్చాల్సి ఉంది. మొత్తం 163 దూలాల్లో నాలుగు అతి పెద్దవి. 8 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ దూలాల కోసం రాళ్లను వెతికి వెతికి.. చివరికి అమ్మవారిపేట క్వారీలో గుర్తించారు. అక్కడ కట్ చేయించి భారీ ట్రాలీల్లో ఆలయం వద్దకు తరలించారు. అక్కడ వాటిని కిందికి దింపి, కదిలించేందుకు 20 టన్నుల సామర్ధ్యమున్న ఆరు క్రేన్లను వినియోగించాల్సి వచ్చింది. వాటిని డిజైన్ ప్రకారం చెక్కుతున్నారు. ఐదారు రోజుల్లో 50 టన్నుల సామర్ధ్యమున్న రెండు హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో మండపంపైన అమర్చనున్నారు. వాటి మీద పైకప్పు రాళ్లను అమర్చితే పనులు పూర్తవుతాయి. కాగా.. దేవాలయం చుట్టూ దశాబ్దాలుగా కబ్జాలు చొచ్చుకువచ్చాయి. ఆ సమయంలోనే కొందరు స్థానికులు శిథిలావస్థకు చేరిన ఈ నాట్య మండపం పైకప్పు శిలలను ఎత్తుకుపోయారు. అలా 40 శాతం రాళ్లు మాయమయ్యాయి. వాటిని వేగంగా సిద్ధం చేస్తున్నారు. జాప్యంతో పెరిగిన ఖర్చు నాట్య మండపాన్ని విప్పదీయటం, పునరి్నర్మాణానికి వీలుగా డాక్యుమెంటేషన్ కోసం 2005లో రూ.3.80 కోట్లు ఖర్చు చేశారు. పునరి్నర్మాణానికి రూ.7 కోట్లు ఖర్చవుతాయని అప్పట్లో అంచనా వేశారు. 2011లో వ్యయాన్ని రూ.7.50 కోట్లకు పెంచారు. ఇదిలా పెరుగుతూపోయి ఖర్చు రూ.13.50 కోట్లకు చేరింది. ఇటీవల రూ.6 కోట్లను విడుదల చేయటంతో పనులు తుది దశకు చేరాయి. అప్పట్లో ఏనుగులతో తరలించి.. క్రీస్తుశకం 1163 సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పుడు రాతి దూలాలను కదిలించేందుకు ఆరు క్రేన్లను వాడుతున్న తరుణంలో.. అప్పట్లో వాటిని ఎలా తరలించారో అన్నది ఆసక్తిగా మారింది. దాదాపు కిలోమీటర్ పొడవునా మట్టికట్టను నిర్మించి దాని మీదుగా ఏనుగుల సాయంతో రాతి దూలాలను లాక్కొచ్చి ఉంటారని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. -
పుష్ప విలాసం.. నేడు ఎంగిలి పూల బతుకమ్మ
తీరొక్క రంగులు. వేర్వేరు రకాలు. వాటన్నింటా సుగంధమే. నిర్జన ప్రదేశాల్లో జన్మ తీసుకొని తంతెలు తంతెలుగా నిర్మితమయ్యే పుష్పాల విలాసమే బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హన్మకొండ: తెలంగాణలోని సంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఈపండుగ వచ్చిందటే ఆడపడుచులకు ఎనలేని ఆనందం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్రమాస అంటారు. బతుకమ్మ పండుగ పెత్రమాసనాడు ప్రారంభమై మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజు అర్రెం అంటారు. ఈరోజు బతుకమ్మను పేర్చడం గానీ ఆడడం గానీ చేయరు. ఆరో రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. బతుకమ్మను పేర్చడానికి వరుసగా పూలను సేకరిస్తుంటారు. ఆకారణంగా ఆరో రోజు పూలను సేకరించకుండా ఉండడానికే అర్రెం అనే నియమం వచ్చినట్లు జానపద పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మను పేర్చేందుకు తంగేడు, గునుగు, సీతజడ, బంతి, కట్ల, మందార, మొల్ల, గోరంట, ముళ్లగోరంట, పట్నం బంతి, తురకబంతి, చామంతి, కలువ తామర, గన్నేరు, ఉద్రాక్ష, జాజి, గుమ్మడి, సంపెంగ తదితర పూలను సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు. ఎంగిలిపూలు అని ఎందుకంటారంటే.. బతుకమ్మ తయారీకోసం ఒకరోజు ముందే పూలను సేకరిస్తారు. పూలు తీసుకొచ్చిన వారింట్లో ఈపూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతున్నారు. ముందు రోజు పూలను సేకరించడం వల్ల మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చుకొని బతుకమ్మను పేర్చుతున్నప్పుడు నోటితో పూలను ఊది వాటిని పేరుస్తారు. అలా పూలను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతుంటారు. పెత్రమాస రోజు ఉదయమే లేచి చనిపోయిన పెద్దలకు నివేదనలు చేసి అనంతరం భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు పితృ అమావాస్య.. పెత్రమాసనే పితృ అమావాస్య అని, మహాలయ అమావాస్య అని పిలుస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు. పూల దారులు ఆదివారం పెత్రమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూల సిబ్బిలు, రంగులు, తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు మొదలైనవి కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో శనివారం రాత్రి రోడ్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్స్ట్రీ్టట్, అంబేడ్కర్ సెంటర్, వరంగల్‌లోని పిన్నవారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశీబుగ్గ, గోపాలస్వామి గుడి, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగాయి. 200 ఏళ్ల నాటి బతుకమ్మ పాట శ్రీలక్ష్మీ దేవియు చందమామ – సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ – భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ– ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ– అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ – వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ – దాయాదులను బాసి చందమామ వనితతో ఆరాజు చందమామ – వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ – జన్మించె శ్రీలక్ష్మీ చందమామ అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్ఠులూ చందమామ – ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈతల్లి చందమామ – బతుకమ్మ యనిరంత చందమామ నేడు పాటల పోటీలు శ్రీరాధేశ్యాం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొని విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులు మహిళలు ప్రశాంతంగా దేవాలయంలో ఆడుకోవచ్చని తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. -
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లు
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లుసాధారణంగా దేవాలయంలో ఒక్కరే ప్రధాన దేవుడు ఉంటాడు. కానీ కొన్ని దేవాలయాల్లో ముగ్గురు దేవుళ్లు మూడు వేరు వేరు గర్భగృహాల్లో ఉంటారు. ఇటువంటి ఆలయాలను త్రికూటాలయాలు అని వ్యవహరిస్తారు. అయితే ఇవి చాలా తక్కువ సంఖ్యలో నిర్మితమయ్యాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి త్రికూటాలయమే. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం, సంగారెడ్డికి సమీపంలోని కల్పగూరు కాశీ విశ్వేశ్వరాలయాలు ఇలాంటివే. హన్మకొండ వేయిస్తంభాల ఆలయం కాకతీయ శిల్ప కళారీతికి అద్దంపట్టే అద్భుతమైన ఆలయం. క్రీ.శ. 1163లో రుద్రదేవ మహారాజు కట్టించిన ఆలయమిది. ఆయన పేరుతోనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అనీ, దీనిలోని లింగాన్ని రుద్రేశ్వర లింగం అనీ వ్యవహరిస్తారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ త్రికూటాలయంలో శివుడు, విష్ణువు, సూర్య దేవుళ్లకు గర్భాలయాలు ఉన్నాయి. స్తంభాలు ఒకదాని తరువాత ఒకటి వరుసలు దీరినట్లు చెక్కబడి కనిపిస్తాయి. మంథనిలోని గౌతమేశ్వరాలయం కూడా త్రికూటాలయమే. దీనిని కూడా 1000 స్తంభాల ఆలయం అని వ్యవహరిస్తారు. ఈ ఆలయం హన్మకొండ ఆలయం కన్నా ముందుగానే నిర్మించారని భావిస్తున్నారు. ఇక్కడి శివలింగం అచ్చంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలోని శివలింగం లాగే ఉంటుంది. ఆదిగురువు శంకరాచార్యులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారట. అయితే, దీన్ని రాష్ట్ర కూటులు నిర్మించారా, లేదా చాళుక్యులా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, కాకతీయులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. మరో త్రికూటాలయం పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం. నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూరు చోళులు నిర్మించిన ఈ దేవాలయానికి రెండు ప్రత్యేక తలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్భ గుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలోకి అది ఉబికిరావడం. 11వ శతాబ్దంలో చాళుక్య శైలిలో నిర్మిచిన ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా, మరొకటి ఖాళీగా కనిపిస్తోంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శన మిస్తారు. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చు కోదు అనేది ఆశ్చర్యపరుస్తుంది. భౌతిక శాస్త్రంలోని పరిక్షేపణ కాంతి ఆధారంగా ఈ త్రికూట ఆలయాన్ని నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో కల్పగూరు గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. హన్మకొండ వేయిస్తంభాల ఆలయ నిర్మాణశైలిలోనే ఇదీ ఉంది. ఈ ఆలయంలో దక్షిణాన కాశీ విశ్వేశ్వరుడు, ఉత్తరాన వేణుగోపాల స్వామి, పశ్చిమాన అనంత పద్మనాభ స్వామి గర్భాలయాలు ఉన్నాయి. (క్లిక్: స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’) కాకతీయ ఆలయాలు నిర్మాణ శైలి, శిల్ప సౌందర్యాలకు ప్రసిద్ధి చెందినా... నాటి ఇంజినీర్లు వాడిన సాంకేతిక విజ్ఞానం కొంత వివాదాస్పదంగా మారింది. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకోవడానికి పునాదుల్లో ఇసుకను వాడటం నాటి ఆలయాల నిర్మాణంలో కనిపించే సాధారణ దృశ్యం. అయితే అదే ఈ ఆలయాల మనుగడకు శాపంగా మారింది. కాలక్రమంలో పునాదులు కుంగి ఆలయాలు కూలిపోవడానికి కారణమయింది. హన్మకొండ ఆలయంలోని కొంత భాగం ఇందువల్లనే దెబ్బతిన్నదని అంటున్నారు. - కన్నెకంటి వెంకటరమణ సంయుక్త సంచాలకులు, ఐ అండ్ పీఆర్, హైదరాబాద్ (‘కాకతీయ వైభవ సప్తాహం’ జూలై 7–13 వరకు) -
పుష్కరకాలంగా పునరుద్ధరణ !
♦ నత్తే నయంలా వేయిస్తంభాల ఆలయ పునరుద్ధరణ ♦ పడుతూ.. లేస్తూ సాగుతున్న కల్యాణ మండప నిర్మాణ పనులు ♦ పనులు ప్రారంభమై ఈ నెల 13కు పన్నెండేళ్లు పూర్తి ♦ చివరలో పైకప్పు దశలో ఆగిన వర్క్స్.. పెండింగ్‌లో రూ.83 లక్షలు.. ♦ ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే.. వరంగల్‌కు చారిత్రక గుర్తింపు తెచ్చే వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కోసం మొదలైన పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. 12 ఏళ్లుగా కల్యాణ మండప నిర్మాణం సాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు వచ్చి వెళ్లడమే గానీ.. ప్రాచీన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న పనులు మొదలు పెట్టగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, వరంగల్ : చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న ప్రారంభించిన పనులు.. పష్కర కాలం గడిచినా... పూర్తి కాలేదు. ఆలయ పునరుద్ధరనలో భాగంగా మొదటగా పాత మండపాన్ని పూర్తిగా తొలగించి.. శిల్పాలు, శిలలను పద్మాక్షి ఆలయం సమీపంలో పడేశారు. ఆ తర్వాత పునాది పనులకు ఐదేళ్లు పట్టింది. పునాది నిర్మాణం ఆలస్యం కావడంతో తొలగించిన శిలలు ఐదేళ్లపాటు పద్మాక్షి ఆలయం సమీపంలో దుమ్ముకొట్టుకుపోయాయి. వీటిని పట్టించుకునే నాథుడు కరువైపోవడంతో కొన్ని శిలలు తమ రూపును కోల్పోయాయి. పెరిగిన అంచనా.. కల్యాణ మండపం పనులు మధ్యలో వదిలేయడంపై నలువైపులా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి అంచనాలు సవరించడంతో పునరుద్ధరణ వ్యయం రూ.7.53 కోట్లకు చేరుకుంది. ఎట్టకేలకు కల్యాణ మండపం నిర్మాణ పనులు 2010 ఫిబ్రవరి 25న తిరిగి మొదలయ్యాయి. రూపుకోల్పోయిన 132 పిల్లర్లు, 160 బీమ్స్ శిలలు, శిల్పాలను తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం తిరిగి చెక్కారు. కల్యాణ మండపం పునర్నిర్మాణంలో ప్రధానమైన శాండ్బాక్స్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన పునాది, దానిపై మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్ నిర్మాణం 2012 చివరి నాటికి పూర్తయింది. అప్పటి నుంచి ఐదేళ్లుగా ఏడు వరుసల ప్రదక్షిణ పథం, నాలుగు వరుసలు ఉండే కక్షాసనం, ఆపై గోడల వరకు నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేస్తే కల్యాణ మండప నిర్మాణ పనులు పూర్తవుతాయి. చివరి దశలో మరోసారి పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఒక్క రాయి ఇటు తీసి అటు వేయలేదు. 2010–11లో సవరించిన అంచనాల ప్రకారం ఇంకా రూ. 83 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నిధుల రాకపోవడంతో చివరి దశలో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ వైభవం వేయిస్థంబాల గుడిని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు వరంగల్‌లో నిర్మించాడు. ఈ ఆలయం వేదికగా జరిగే సాంస్కృతిక, థార్మిక కార్యక్రమాలకు కళ్యాణమండపం వేదికగా ఉండేది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత కాలక్రమంలో కళ్యాణమండపం దక్షిణం వైపు ప్రవేశద్వారం కుంగిపోయింది. కళ్యాణమండపం నిర్మాణానికి మొత్తం 2560 శిలలు, శిల్పాలను కాకతీయలు ఉపయోగించారు. కళ్యాణమండపం ఎత్తు 9.5 మీటర్లు ఉండగా భూమిలో ఆరు మీటర్లలోతు పునాదులు ఉన్నాయి. కళ్యాణమండపంలో ఉత్తర–దక్షిణ దిక్కుల మధ్య దూరం 33.18 మీటర్లు, తూర్పు–పడమరల మద్య దూరం 33.38 మీటర్లుగా ఉంది. మంటపం మధ్యలో నాట్యం చేసేందుకు వీలుగా వేదిక ఉంటుంది. 400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. తూర్పు ద్వారం గుండా రాజకుటుంబం, దక్షిణ ద్వారం గుండా ప్రజలు కళ్యాణమండపంలోకి ప్రవేశించి ఆటుపై రుద్రేశ్వరాలయంలో దైవదర్శనం చేసుకునేవారు. -
6 నెలల్లో వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ
► మరో వెయ్యేళ్లు నిలిచేలా వేయిస్తంభాల గుడిని నిర్మిస్తున్నామన్న కేంద్ర పురావస్తు శాఖ ► పునర్నిర్మాణ పనులు మరో 15 రోజుల్లో తిరిగి షురూ ► ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్న సదస్సులో వెల్లడి ► ఆలయ నిర్మాణ కౌశలం, పునర్నిర్మాణ ప్రక్రియపై అబ్బురపడ్డ విదేశీ ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర శతాబ్దాల క్రితం నాటి అద్భుత దేవాలయం.. నిర్మాణంలో ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యం.. ఆశ్చర్యపరిచే శాండ్బాక్స్ పరిజ్ఞానం.. గుడికి అనుబంధంగా 10 మీటర్ల ఎత్తుతో, 2,500 కళాకృతులతో రాతి దిమ్మెలతో కూడిన నాట్య మండపం.. మనందరికీ తెలిసిన వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రత్యేకతలివి. ఇందులో దెబ్బతిన్న మండపం పునరుద్ధరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను మరో ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్ (కన్జర్వేషన్) రోమెల్ సింగ్ జమ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటివరకు పునరుద్ధరణకు అడ్డంకిగా మారిన నిధుల సమస్యతోపాటు ఇతర అంశాలను అధిగమించినట్టు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న పురావస్తు శాఖ సదస్సులో మంగళవారం ఈ అంశాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థా పకుడు పాండురంగారావు ప్రస్తావించగా.. జమ్వాల్ ధ్రువీకరించారు. 15 రోజుల్లో పనులన్నింటినీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అత్యంత కచ్చితత్వంతో.. కాకతీయ రాజు రుద్రదేవుడి హయాంలో 1163 సంవత్సరం (అంచనా)లో రూపుదిద్దుకున్న ఈ మండపం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలాంటి తేడా లేకుండా అదేరకంగా పునర్నిర్మిస్తున్నట్లు పాండురంగారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో చెదిరిపోకుండా 350 గ్రాన్యులార్ పైల్స్‌ను భూగర్భంలోకి చొప్పించామని, 150 బోరు రంధ్రాల ద్వారా సున్నపు మిశ్రమాన్ని భూపొరల్లోకి పంపి నేల గట్టిపడేలా చేశామ న్నారు. ప్రతి చదరపు మీటరుకు 40 టన్నుల బరువును నిలిపే స్థాయిలో పటుత్వాన్ని పునాదులకు కల్పించి పనులు చేపట్టామన్నారు. రాళ్లను కలిపి ఉంచిన పురాతన ఇనుప పట్టీలు పాడవడంతో.. స్టెయిన్లెస్ స్టీలు పట్టీలను వినియోగించామని చెప్పారు. గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కే అవకాశం! కనీసం మరో వెయ్యి ఏళ్లS వరకు ఈ మండపం నిలిచి ఉంటుందని పాండురంగారావు భరోసా ఇస్తున్నారు. 1972లో కరువు సంభవించి వరంగల్ పట్టణంలోని చెరువులన్నీ ఎండిపోయినా ఆలయ ప్రాంగణంలోని కోనేరు నిండుగా నీటితో ఉండి ప్రజల దాహార్తి తీర్చిన విషయాన్ని ఆయన సభలో వివరించారు. కాగా.. అత్యంత క్లిష్టమైన నిర్మాణాన్ని విప్పదీసి.. ఎక్కడా సిమెంటు కాంక్రీట్‌ను వాడకుండా సంప్రదాయ డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతి పొడిలాంటి వాటితోనే పునర్నిర్మిస్తున్న ఈ కట్టడం గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకునే అవకాశముందని చెబుతున్నారు. అందువల్ల దీనిని గిన్నిస్ బుక్ వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. -
కల్యాణ మండపం ఏమాయె..!
పురావస్తుశాఖ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించిన హైకోర్టు జడ్జి రాజశేఖర్ హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో కల్యాణ మండపం 15 నెలల్లో నిర్మిస్తామని పురావస్తుశాఖ 2008లో హైకోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి రాజశేఖర్ గుర్తు చేశారు. ఇప్పటికీ దాన్ని నిర్మించకపోవడం ఆశాఖ నిర్లక్ష్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. దేవాలయ ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు ఆలయమర్యాదలతో ఆయన్ను స్వాగతించారు. పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్రా్తలు, మహాదాశీర్వచనం ఇచ్చారు. 8 ఏళ్ల క్రితం దేవాలయ కల్యాణమండపం విషయమై భక్తులు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని జడ్జి తెలిపారు. నాడు తాను కేంద్ర పురావస్తుశాఖ తరఫున వాదించానని తెలిపారు. ఆ సమయంలో పురావస్తుశాఖ అధికారులు 15 నెలల్లో పూర్తిచేస్తామని హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ దాన్ని పూర్తి చేయకపోవడం కోర్టును నిర్లక్ష్యం చేసినట్లేనన్నారు. ఇప్పుడు ఎవరైనా హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేస్తే పురావస్తుశాఖ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జడ్జి వెంట సీఐ సంపత్‌రావు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఘనంగా లక్షబిల్వార్చన కార్తీకమాసోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మహిళలు దేవాలయప్రాంగణంలో దీపదానాలు చేశారు. బహుళ షష్టి తిథిని పురస్కరించుకొని స్వామివారిని బిల్వ దళాధిపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ , అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ, పానుగంటి ప్రణవ్‌లు మహాగణపతికి అభిషేకం జరిపారు. శ్రీరుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శ్రీమహాలక్ష్మి ఉద్భవించిన మారేడుదళాలతో లక్షబిల్వార్చన చేశారు. ప్రముఖ శివభక్తుడు దాత ముపదాసు సురేష్‌బాబు దంపతులు దీనికి యాజమాన్యం వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. ప్రదోషకాల పూజలలో జిల్లా ఫోర్త్ క్లాస్ కోర్టు జడ్జి గోవిందలక్ష్మి పాల్గొన్నారు. శ్రీరుద్రేశ్వరునికి పూజలు నిర్వహించారు. నేడు.. కార్తీకమాసం నాల్గో సోమవారం రుద్రేశ్వరునికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని ప్రధానార్చకులు తెలిపారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకోవచ్చునని సూచించారు. -
రామప్పా.. నువ్వే దిక్కప్పా!
♦ ‘ఓరుగల్లు’కు చేజారిన వారసత్వ హోదా ♦ వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోటలను గుర్తించలేమన్న యునెస్కో ♦ కట్టడాలకు సమీపంలోని ఆక్రమణలే కారణం ♦ కట్టడాలు గొప్పవే.. నిబంధనలను కాదని హోదా ఇవ్వలేమని వెల్లడి ♦ ఇక రామప్ప దేవాలయంపై ప్రభుత్వ దృష్టి ♦ పక్కాగా డోసియర్ రూపొందించి మళ్లీ దరఖాస్తు ♦ ఈసారి హోదా తథ్యమన్న ఆశాభావం ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణకు చోటు దక్కినట్టే దక్కి త్రుటిలో చేజారిపోయింది. పరాక్రమానికే కాకుండా నిర్మాణ రంగంలో గొప్ప పరిజ్ఞానాన్ని చూపిన కాకతీయుల ఘన చరిత్రకు ప్రపంచ వారసత్వ సంపద హోదా చివరి నిమిషంలో వెనక్కి పోయింది. వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోటలకు వారసత్వ హోదా ఇవ్వలేమని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ తేల్చి చెప్పింది. గొప్ప చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ నిర్మాణాల చుట్టూ వెలిసిన ఆక్రమణలే దీనికి కారణమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రామప్ప దేవాలయంపై దృష్టి సారించింది. వేయి స్తంభాల గుడికి తీసిపోని ఖ్యాతి ఉన్న ఈ ఆలయానికి ఆక్రమణల బెడద లేనందున... దీనిని ‘హోదా’ కోసం ప్రతిపాదిస్తూ తాజాగా యునెస్కో తలుపుతట్టింది. - సాక్షి, హైదరాబాద్ కొంప ముంచిన ‘వంద మీటర్ల’ నిబంధన వరంగల్ కోట, వేయిస్తంభాల గుడులకు ప్రపంచ వారసత్వ హోదా కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం యునెస్కోకు ప్రతిపాదనలు చేసింది. దీంతో ప్యారిస్ నుంచి ఆ సంస్థ నిపుణులు వరంగల్‌కు వచ్చి కట్టడాలను పరిశీలించారు. ఈ నిర్మాణాలు అత్యద్భుతంగా ఉన్నాయని కీర్తించారు కూడా. దాంతో గుర్తింపు ఖాయమని భావించారు. కానీ ఆ నిర్మాణాలకు వంద మీటర్లలోపు భారీగా ఆక్రమణలు ఉన్నాయని పేర్కొంటూ ‘హోదా’ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రపంచ వారసత్వ గుర్తింపును కేటాయించే విషయంలో ‘యునెస్కో’ నిబంధనలను కచ్చితంగా పాటిస్తుంది. నిర్ధారిత కట్టడం/స్థలానికి వంద మీటర్ల పరిధిలో, ఆ కట్టడంతో సంబంధం లేని ఎలాంటి నిర్మాణాలు ఉండరాదు. దానిని నిషేధిత ప్రాంతంగా పేర్కొంటుంది. 200 మీటర్ల పరిధిని నిరోధిత ప్రాంతంగా పరిగణిస్తుంది. తాత్కాలిక నిర్మాణాలు తప్ప పక్కా నిర్మాణాలు ఉండకూడదు. దీంతో చేతిదాకా వచ్చిన వారసత్వ హోదా చేజారిపోయింది. ఇవీ రామప్ప ప్రత్యేకతలు నిర్మాణం: 11వ శతాబ్దం, శిల్పి రామప్ప. నేతృత్వం: కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో రేచర్ల రుద్రుడి పర్యవేక్షణలో నిర్మాణం. నిర్మాణ కాలం: దాదాపు 40 ఏళ్లు ప్రత్యేకతలు: సాండ్ బాక్స్ (ఇసుక పొర) టెక్నాలజీ వినియోగం. నీటిలో తేలే ఇటుకలు, భిన్న రకాలైన రాళ్ల వాడకం, కాలక్రమంలో ప్రధాన బీమ్ ధ్వంసమైనా ఇసుమంతైనా నష్టపోని కట్టడం. సప్తస్వరాలు పలికే రాయి, వెంట్రుకలు దూరేంత సందులతో కూడిన నగిషీలు, అద్దాన్ని మరిపించేలా రాళ్లను నున్నగా చెక్కడం. హోదాతో ఉపయోగం: యునెస్కో గుర్తింపు వస్తే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. యువతకు ఉపాధి అవకాశాలే కాకుండా విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. కట్టడం పర్యవేక్షణ, అభివృద్ధి, పరిరక్షణకు యునెస్కో నిధులు ఇస్తుంది. రామప్పకు హోదా తథ్యం! ‘ఓరుగల్లు’కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎలాంటి ఆక్రమణలు లేని రామప్ప దేవాలయాన్ని నమ్ముకుంది. వాస్తవానికి యునెస్కోకు చేసిన తొలి ప్రతిపాదనలో రామప్పను కూడా చేర్చింది. కానీ ఒకే ప్రతిపాదన (డోసియర్)లో ఉన్నందున అది కూడా తిరస్కరణకు గురికావాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఒక్క రామప్ప దేవాలయాన్ని మాత్రమే ప్రతిపాదించాలని తాజాగా నిర్ణయించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సహకారంతో పురావస్తు శాఖ ఓ కన్సల్టెన్సీతో ప్రత్యేక డోసియర్ రూపొందించి యునెస్కోకు దరఖాస్తు చేసింది. -
వేయి స్తంభాల కోసం.. వేయి కళ్లతో..
సాక్షి, హన్మకొండ: కాకతీయుల శిల్పకళకు అద్దంపట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా పునరుద్ధరణ పనులు మధ్యలో ఆగిపోయాయి. నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా పేరొందింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా జీవకళ ఉట్టిపడే భారీ నంది విగ్రహం.. దాని వెనుక అద్భుతమైన కల్యాణ మంటపం ఉండేది. పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచింది. 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్ని ర్మించాలని నిర్ణయించింది. నాటి కాకతీయుల నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించి ఇందుకోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది. పదేళ్లు గడిచినా.. కల్యాణ మంటపం పున:నిర్మాణ పను లు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మంటపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత రెండున్నరేళ్ల పాటు పనులు సాగలేదు. ఎట్టకేలకు 25-02-2010న మళ్లీ పనులు మొదల య్యాయి. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తిరిగి వినియోగించడానికి వీల్లేకుండా ఉన్న శిల లకు బదులుగా కొత్తగా 132 పిల్లర్లు, 160 బీమ్ శిలలు, శిల్పాలను చెక్కారు. కాకతీయులు ఉపయోగించిన ‘శాండ్బాక్స్’ టెక్నాలజీ ఆధారంగా పనులు మొదలె ట్టారు. మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. దీనిపై ఏడు వరుసలు రాతి నిర్మాణంతో మొదలయ్యే ప్రదక్షిణ పథం నిర్మించారు. అనంతరం నాలుగు వరసలు ఉండే కక్షాసనం నిర్మించారు. ఆపై రాతిగోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న శిలలను పట్టి ఉంచేలా ముఖ్యమైన శిలలకు స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను అమర్చారు. గతంలో కాకతీయులు కరిగించిన ఇనుమును పోసిన పోతల్లోనే ఈ స్టెయిన్లెస్ స్టీలు పట్టీలు అమర్చారు. కిందామీదా పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ, మరోసారి నిధుల కొరత ఏర్పడటంతో గడిచిన మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మేడారం జాతర సమయంలో దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు భక్తులు చేరుకుంటారు. అప్పటి వరకైనా కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు పూర్తరుుతే... వేయిస్తంభాల గుడికి పునర్ వైభవం వస్తుంది. -
వేయిస్తంభాల గుడి పక్కన ‘యెతిమ్‌ఖానా’
వేయిస్తంభాల గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. హన్మకొండలోని జక్రియా ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దాదాపు 2 కోట్ల మంది ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టరేట్‌ను కూడా పరిశీలించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హన్మకొండ చౌరస్తా : వేయిస్తంబాలగుడి సమీప ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హన్మకొండలోని జక్రి యా ఫంక్షన్‌హాల్ లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ సర్కారేనన్నారు. సుమారు 2 కోట్ల మంది ము స్లింలకు పండుగ సరుకులు అందజేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు స్థలాల ను చూపెడితే ఖబరస్థాన్ల ఏర్పాటుకు అధికారులతో చర్చిస్తామన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు ముందు వరుసలో నిలిచారన్నారు. ముస్లింల జీవన విధానంపై సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక చూసి కేసీఆర్ కంటతడి పెట్టారని గుర్తు చేశారు. టీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు మాట్లాడుతూ, ఎన్ని ఆరోపణలు ఎదురైనా నిజాం సర్కార్ పనితీరును మెచ్చుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం డిప్యూటీ సీం పెద్దమ్మగడ్డ ఈద్గా పరిశీలించారు. వివాదంలో ఉన్న స్థలాల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో లింగంపల్లి కిషన్‌రావు, కోలా జనార్దన్, మహ్మద్ నయిమొద్దీన్, డాక్టర్ అనీఫ్ సిద్దిఖీ, వెంకటాచారి పాల్గొన్నారు. -
వెయ్యి బంధాల గుడి
వెయ్యి స్తంభాల గుడి ఎక్కడుందో చెప్పుకోండి! వరంగల్ కదా. అదొక అద్భుతమైన నిర్మాణ వైభవం. ఇక్కడి కల్యాణ మండపంలో ఏ స్తంభానికా స్తంభాన్ని తీసి మళ్లీ పేర్చగలం. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది కూడా! అంత మహా అద్భుతం అలవోకగా చేస్తున్న వరంగల్‌లో ఐదు నెలల క్రితం వెయ్యి బంధాల మండపం వెలిసింది. ఇక్కడ పెళ్లిళ్లు చేయరు... కాపురాలు నిలబెడతారు. కల్యాణమండపంలో స్తంభాలను మళ్లీ నిలబెట్టినట్టుగా ఇక్కడ కాపురాలు నిలబెడతారు. వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఈజ్ డెఫినెట్లీ ‘వెయ్యి బంధాల గుడి’! ‘జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నాం. దీనికో పరిష్కారం చూపండి’ అంటూ ఈ ఐదు నెలల కాలంలోనే వరంగల్ అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 1097 కేసులు నమోదయ్యాయి. కుటుంబ పెద్దల్లా వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, మంచి మాటలతో సర్దిచెప్పడంతో.. అందులో 977 జంటలు తిరిగి ఒక్కటయ్యారు. మరో 68 పిటిషన్లు కోర్టుకు వెళ్లగా.. 52 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. విడిపోదామని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినవారు.. కలిసుంటామని ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. రికార్డు స్థాయిలో ఘనత సాధించిన ఈ మహిళా పోలీస్‌స్టేషన్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సర్ది చెబుతున్నారు... ఏ కారణం చేత విడిపోవాలనుకున్నా అది వారికే క్షేమకరం కాదని, సమాజంలో కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత, కుటుంబంలో ఉండటం వల్ల వచ్చే సంతోషం, కలిగే సంతృప్తి... జీవితంలో ఎంత అమూల్యమైనవో మంచి మాటలతో సర్దిచెబుతున్నారు ఈ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది. వీరిలో సి.ఐ. రాయల ప్రభాకర్‌రావు, ఎస్.ఐ. సుజాత, ఎస్.ఐ. నస్రీన్ సుల్తానా, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోమ్గార్డ్స్ ఉన్నారు. ‘కొన్ని సార్లు పిటిషనర్లు చెప్పే సమస్యలను నాలుగైదు గంటల పాటు విన్న సంఘటనలూ ఉన్నాయి. వారి సమస్యను శ్రద్ధగా వింటున్నామనే నమ్మకం పిటిషనర్‌కి కలిగితే సగం సమస్య పరిష్కారమయినట్లే’ అని తెలిపారు సి.ఐ. రాయల ప్రభాకర్‌రావు. దంపతుల్లో ఇద్దరూ చెప్పేదాంట్లో సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకొని, ఇద్దరిలో ఉన్న ప్రతికూల అంశాలను సరిదిద్దుకోవాల్సిందిగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మత విశ్వాసాలను గౌరవిస్తూ వారికి సంబంధించిన మతస్తులతోనే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. అలాగే తాగుడు అలవాటు ఉండి భార్యలను ఇబ్బంది పెట్టే భర్తలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇరువైపుల తల్లితండ్రులకూ కౌన్సెలింగ్... పెళ్లై అత్తవారింట్లో ఉన్న కూతురితో క్షేమ సమాచారం కోసం తల్లులు నిరంతరం మాట్లాడుతుండటం ఇబ్బందులకు దారి తీస్తోంది. కోడలిపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో అవసరం ఉన్నా లేకపోయినా కోడలిని తక్కువ చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన పోలీసు సిబ్బంది భార్యాభర్తలకే కాకుండా, వారి వారి తల్లితండ్రులనూ పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కౌన్సెలర్ దయాకర్ ఈ విషయంపై స్పందిస్తూ - ‘‘ పిల్లల సంసారంలో పెద్దల జోక్యం ఎంతవరకు అవసరమో...ఎంత వరకు అనవసరమో చెబుతున్నాం. పిల్లలు కలిసి ఉంటేనే, పెద్దలకు ఆనందం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. సలహాలు, సూచనలు ఇస్తున్నాం’’ అని తెలిపారు. - తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ ఫోటోలు : పెద్దపెల్లి వరప్రసాద్ వివాహ బంధాన్ని కొనసాగించలేక విడిపోదామనుకుంటున్న వెయ్యి జంటలు చెబుతున్న కారణాలలో ఇవే ప్రధానమైనవి... భర్తలు... నా భార్య, నా తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. వాళ్లకు సమయానికి తిండి పెట్టడం లేదు. వాళ్లు వచ్చినప్పుడు లేచి నిల్చుని గౌరవం ఇవ్వట్లేదు. అమ్మానాన్నలను తిడుతోంది. వాళ్లకు సంబంధించిన చిన్నచిన్న పనులూ సక్రమంగా చేయడం లేదు. భార్యలు... నా భర్త , ఆయన తల్లిదండ్రుల మాటే వింటాడు. నా మాటకు విలువ లేదు. నన్నసలు పట్టించుకోడు. అత్తామామల మాట విని నన్ను కొడతాడు. ఆడబిడ్డల ముందు నన్ను తిడతాడు. సమస్యను పూర్తిగా వినాలి జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝా, క్రైం డీఎస్పీ ఈశ్వర్రావు పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చేవారికి పరిష్కారం చూపిస్తున్నాం. సమస్య తీవ్రతను అనుసరించి కౌన్సెలింగ్ ప్రక్రియలో సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం తీసుకుంటున్నాం. - రాయల ప్రభాకర్‌రావు,సర్కిల్ ఇన్స్పెక్టర్,మహిళా పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్ ప్రతిదీ రికార్డు చేస్తాం... ప్రతి కేసుకు సంబంధించి ఫైల్‌ను మెయింటెయిన్ చేస్తాము. తొలిసారి పిటిషన్ ఇచ్చింది మొదలు- పరిష్కారం అయ్యే వరకు మేం చేపట్టిన అన్ని అంశాలను ఆ ఫైలులో పొందుపరుస్తాం. పిటిషనర్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫైలు ఆధారంగా గతంలో చెప్పినవి.. ఇప్పుడు జరుగుతున్న అంశాలను బేరీజు వేసుకుని పరిష్కార మార్గాలు వెతుకుతాం. - సుజాత, సబ్ ఇన్స్పెక్టర్,మహిళా పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్ జీవితంలో వెలుగు... నేను, నా భర్త ఇద్దరం విద్యావంతులమే. ఆయన మా పుట్టింటి వాళ్లను ఇంటికి రానిచ్చేవారు కాదు. ఎవరితోటీ మాట్లాడవద్దనేవారు. ఏ పని చేసినా అనుమానంగా చూస్తూ నిందలు మోపేవారు. అకారణంగా నన్ను కొట్టేవాడు. ఎందుకు కొడుతున్నాడో, ఏ కారణంతో తిడుతున్నాడో అర్థమయ్యేది కాదు. మధ్యమధ్యలో అబార్షన్లు. గతంలో ఓ సారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం అవకపోగా కష్టాలు రెట్టింపు అయ్యాయి. కానీ రోజురోజుకి ఇబ్బందులు పెరిగిపోవవడంతో మహిళా పోలీస్ స్టేషన్, వరంగల్ అర్బన్‌ను ఆశ్రయించాను. నేను ఆయనతో బతకలేను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండని వేడుకున్నాను. ఫిబ్రవరిలో నాకు , నా భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అప్పటి నుంచి నాభర్తలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం నేను గర్భిణిగా ఉన్నాను. మధ్యలో ఆగిపోయిన నా చదువు కొనసాగించాలని నా భర్తే అంటున్నాడు. నా జీవితంలో ఇది ఊహించని మార్పు. - సుమతి (పేరుమార్చాం) ఇరువైపులా కౌన్సెలింగ్... చిన్న సమస్యలను పరిష్కరించుకోలేక నేడు విడిపోయేందుకు ఎన్నో జంటలు సిద్ధపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య పెద్ద అగాథం ఏర్పడుతోంది. సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా సరైన బాధ్యత తీసుకోవడం లేదు. అందుకే, భార్యాభర్తలు ఇద్దరికే కాకుండా ఇరువైపుల తలిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.. - దయాసాగర్, కౌన్సెలర్ -
ప్రపంచ వారసత్వ గుర్తింపే లక్ష్యం
వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బరిలో కాకతీయ కట్టడాలు డోసియర్ రూపకల్పనకు కేంద్రం ఆదేశం మూడేళ్లుగా సాగుతున్న కృషి గుర్తింపు సాధిస్తే ఉపాధికి ఊపు హన్మకొండ : ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు సాధించే క్రమంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా రామప్పగుడి, వేయి స్తంభాల దేవాలయం, ఖిలావరంగల్ కీర్తితోరణాలపై సమగ్ర నివేదిక రూపొందించాల్సిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డోసియర్ రూపకల్పనలో కాకతీయ హెరిటేజ్ సంస్థ నిమగ్నమైంది. కాకతీయుల కళావైభవానికి ప్రతీకలుగా నిలిచిన ఈ కట్టడాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. యునెస్కో- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటిటేవ్ జాబితాలో ఇప్పటికే ఈ కట్టడాలకు చోటు లభించింది. డోసియర్ రూపకల్పనకు ఆదేశాలు రామప్పగుడి, రుద్రేశ్వరాలయం, ఖిలావరంగల్ శిలాతోరణాలు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సాధించే క్రమంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం దేశవ్యాప్తంగా పోటీపడుతున్న చారిత్రక కట్టడాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్ 10న న్యూఢిల్లీలో జరిగిన(నేషనల్ వర్క్‌షాప్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఇండియన్ సైట్స్ ఆన్ టెంటిటేటివ్ లిస్ట్ ఫర్ ఫ్యూచర్ నామినే షన్స్ యాజ్ వరల్డ్ హెరిటేజ్) సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రామప్ప ఆలయం, వేయిస్థంభాలగుడి, ఖిలావరంగల్ విశిష్టతలను కేంద్ర, రాష్ట్ర పురవస్తు శాఖతోపాటు కాకతీయ హెరిటేజ్ ట్రస్టుల నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు ఈ సదస్సులో తెలియజేశారు. ఈ సందర్భంగా చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకునే జాగ్రత్తలు, ప్రస్తుతం చారిత్రక కట్టడాలు ఉన్న తీరు, చారిత్రక కట్టడాల విశిష్టతలను తెలిపేలా సమగ్ర సమాచారంతో డోసియర్(పూర్తి సమాచారంతో కూడిన నివేదిక) రూపొందించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కోసం నామినేషన్ దాఖలు చేయడంలో ఈ డోసియర్ది కీలకమైన పాత్ర. ఆరు నెలల్లోపు పురవస్తుశాఖ , కాకతీయ హెరిటేజ్ సంస్థలు ఈ డోసియర్‌ను రూపొందించాల్సి ఉంది. మూడేళ్లుగా సాగుతున్న కృషి 2012 ఆగస్టులో చెన్నైలో జరిగిన సదరన్ రీజియన్ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ సదస్సులో కాకతీయ హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు వేయిస్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, ఖిలావరంగల్ శిలాతోరణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ సానుకూల స్పందన లభించడంలో ఇంటర్నెషనల్ కమిటీ ఆఫ్ మాన్యుమెంట్స్, స్ట్రక్చర్స్(ఐకోమస్, పారిస్) సంస్థకు సైతం కాకతీయుల చారిత్రక కట్టడాల విశిష్టతను గుర్తించాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేశారు. ఆ తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటేటివ్ లిస్ట్ -2014లో కాకతీయ కట్టడాలకు చోటు లభించింది. తాజాగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటే కేంద్రం ఆదేశించింది. యునెస్కో గుర్తింపు లభిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక హృదాయ్లో వరంగల్ నగరానికి ఇటీవల చోటులభించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్-కరీంనగర్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన అద్భుత కట్టడాలకు ప్రచారం లభిస్తుంది. ఈ కట్టడాల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికై ఇటు యునెస్కోతో పాటు కేంద్రం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది. ఇందుకు కర్ణాటకలోని హంపీ మంచి ఉదాహరణ. యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. టూరిస్టుల సంఖ్య నాలుగింతలైంది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ మార్పుకు తగ్గట్టుగా అక్కడ హోటళ్లు, టాక్సీలు, ఫుడ్‌కోర్టులు, గైడ్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా యువతకి ఉపాధి మార్గాలు మెరుగయ్యాయి. అదే పద్ధతిలో వేయి స్తంభాలగుడి, రామప్ప, ఖిలావరంగల్‌కు యునెస్కో గుర్తింపు లభిస్తే జిల్లాలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఐలోని, కొమురవెల్లి, మల్లూరు, మేడారం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవులగుట్ట, గణపురం సున్నపురాయి గుహలు, పెంబర్తి, చేర్యాల హస్తకళలన్నీంటిని కలిపి టూర్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయొచ్చు. -
సీఎంను కలిసిన గాంధీ నాయక్
* వేయి స్తంభాల ఆలయంలో దీక్షను విరమింపజేయండి * జిల్లా మంత్రులను ఆదేశించిన కేసీఆర్ కొడకండ్ల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అరగుండు, అర మీసంతో వినూత్న తరహాలో ఉద్యమానికి అంకితమైన మండలంలోని మొండ్రాయి శివారు గిర్నితండాకు చెందిన దారవత్ మోహన్‌గాంధీ నాయక్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు ఆమరణ దీక్షలు, పాదయాత్ర నిర్వహించారు. అంతేగాక తెలంగాణ ఏర్పడే వరకు అర గుండు, అర మీసంతో ఉంటానని 1259 రోజులుగా విన్నూత దీక్షను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించాక దీక్షను గాంధీ విరమించాలనుకున్న తరుణంలో ఘనంగా సన్మానించి దీక్షను విరమింప చేస్తానని కేసీఆర్ చేప్పడంతో నేటికి దీక్షలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో గాంధీ నాయక్ సీఎంను కలిశారు. దీంతో వేయిస్థంభాల గుడిలో జిల్లా మంత్రులు, నాయకుల సమక్షంలో సన్మానించి దీక్షను విరమింపజేయాలని అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం రాజయ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన నీకు తప్పక న్యాయం చేస్తానని, అధైర్యపడొద్దని తనకు సీఎం అభయం ఇచ్చారని గాంధీ నాయక్ తెలిపారు. -
వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు?
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మధ్యభాగంలో సగర్వంగా కనిపించే స్వాగతద్వారం తెలుగు ప్రజలను మహోన్నతంగా పాలించిన కాకతీయ రాజులను స్ఫురణకు తెస్తుంది.ఏకశిలతో రూపొందించిన ఆ స్వాగత తోరణం కాకతీయుల విజయ చిహ్నం. ఇది ఏకశిల నగర నిర్మాతల పటిష్టమైన, ప్రజారంజక పాలనను ఘనంగా చాటుతోంది. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను సమున్నతంగా నిలబెడుతోంది. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధితో నిలకడగా ఉందంటే దానికి కారణం కాకతీయులు తవ్వించినచెరువులు, కాలువలు, సరస్సులే. నేటికీ తెలుగువారి సామాజిక, ఆర్థిక జీవన విధానంలో కాకతీయుల పాలనా ముద్ర సజీవంగా ఉంది. తెలంగాణలోని ప్రతి పల్ల్లె పచ్చగా ఉండటానికి కారణం కాకతీయులే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలోని అనేక శిలలు, సుందరమైన దేవాలయాలు, వైవిధ్యభరితమైన కళలు కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. నేటికీ ఎందరో కవుల రచనలు, కళాకారుల గళాల ద్వారా వీరి పాలనా వైభవం కీర్తి పొందుతూనే ఉంది. కాకతీయులు శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలనతో వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడిన రాజులు కాకతీయులు. వీరు భిన్న మతాల మధ్య సఖ్యత నెరపి, తెలుగు ప్రజల ప్రగతికి కృషి చేశారు. రెడ్డి రాజులు, విజయనగర రాజపాలకులకు మార్గదర్శకులయ్యారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులకు సేనానులుగా పనిచేస్తూ తెలుగు ప్రాంతంలో స్థిరపడ్డారు. తర్వాత తమ బలాన్ని పెంచుకొని తూర్పు చాళుక్యులకు సామంతరాజులుగా వరంగల్ జిల్లాలోని మానుకోట దగ్గరలో ఉన్న ‘కొరివి’ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల ప్రస్తావన మొదటిసారిగా తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ (క్రీ.శ. 956)లో ఉంది. ఈ శాసనంలో దానార్ణవుడు తనకు రాష్ట్రకూట సేనాని కాకర్త్యగుండన సహాయం చేశాడని ప్రస్తావించాడు. ఈ కాకర్త్యగుండన రాష్ట్రకూట రాజైన మూడో కృష్ణుడి ఆదేశాల మేరకు దానార్ణవునికి సహాయపడ్డాడు. దానార్ణవుని మరణం తర్వాత గుండన స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేంద్రంగా పాలించిన ముదిగొండ చాళుక్యులు గుండన స్వతంత్రతను అంగీకరించలేదు. గుండన వారిని ప్రతిఘటించాడు. పశ్చిమ చాళుక్యులు కూడా గుండన స్వతంత్రతను ఒప్పుకోలేదు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పశ్చిమ చాళుక్యుల సేనాని ‘విరియాల ఎర్ర భూపతి’ చేతిలో గుండన మరణించాడు. ఇతడి పాలనాకాలం క్రీ.శ. 955 నుంచి 995. ఇతడు పాలించిన ప్రాంతం పశ్చిమ చాళుక్యుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ సమయంలో గుండన కుమారుడైన మొదటి బేతరాజు, ఎర్ర భూపతి భార్య కామసాని సహాయంతో ‘అనమకొండ’ (హన్మకొండ) విషయాన్ని (ప్రాంతం) పశ్చిమ చాళుక్యుల నుంచి పొందాడు. వీరికి సామంతునిగా ఉండి క్రీ.శ. 1000 నుంచి తన పాలనను ప్రారంభించాడు. ఈ వివరాలన్నీ కాకతీయ రాజు గణపతిదేవుని చెల్లెలైన మైలమదేవి వేయించిన బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తున్నాయి. కాకతీయ వంశ నామం: కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్ననృపుడు. ఇతని పాలనాకాలం క్రీ.శ. 800-815 మధ్య ఉంటుందని బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తోంది. ఈయన ‘కాకతిపురం’ నుంచి పాలన సాగించాడని, అందువల్ల ఈ వంశానికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. కానీ నాడు ‘కాకతి’ అనే నగరం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ‘కాకతి’ అనే దేవిని పూజించడం వల్ల వీరిని కాకతీయులుగా పిలిచారని మరికొందరి అభిప్రాయం. కాకతీయులు మొదట జైనమతాన్ని అవలంభించారు. ఆ తర్వాత రెండో ప్రోలరాజు కాలంలో సుప్రసిద్ధ శైవమతాచార్యుడైన రామేశ్వర పండితుని సూచన మేరకు శైవ మతాన్ని స్వీకరించారు. తొలి కాకతీయులు ‘కాకతమ్మ’ అనే జైన దేవత విగ్రహాన్ని ప్రతిష్టించిన వరంగల్ పట్టణమే ‘కాకతిపురం’గా ప్రసిద్ధి చెందిందని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం, వినుకొండ వల్లభాచార్యుడి ‘క్రీడాభిరామం’ గ్రంథాల్లోని అంశాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. కాకతీయ రాజులు - వారి పాలన మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 - 1030): కాకతీయుల గురించి తెలిపే శాసనాధారాలు మొదటగా బేతరాజు పాలన గురించే వివరిస్తున్నాయి. ఇతడు పశ్చిమ చాళుక్యుల సామంతునిగా అనమకొండ ప్రాంతాన్ని పాలించాడు. నేతవాడి, కొరివి ప్రాంతాలు బేతరాజు పాలనలోనే ఉండేవి. ఇతడు కాకతిపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈ విషయాలన్నీ కాజీపేట శాసనం ద్వారా తెలుస్తున్నాయి. మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1030 - 1075): పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుడికి అనుంగు మిత్రుడైన ప్రోలరాజు ‘అనమకొండ’పై పూర్తి అధికారాన్ని సాధించాడు. చక్రకూట రాజులతో జరిగిన యుద్ధాల్లో సోమేశ్వరుడికి ప్రోలరాజు చాలా సహాయపడ్డాడు. కాకతీయుల్లో సొంతంగా నాణేలు ముద్రించుకున్న మొదటి రాజు ప్రోలరాజే. ఇతడికి ‘అరిగజకేసరి’ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజు కాకతీయ రాజుల్లో వ్యవసాయాభివృద్ధికి తొలిసారిగా చెరువులు తవ్వించాడు. ఇతడు ‘జగత్ కేసరి’ అనే చెరువును తవ్వించాడు. పశ్చిమ చాళుక్యులు ఇతడికి అనమకొండపై వంశ పారంపర్య హక్కులు కూడా ఇచ్చారు. రెండో బేతరాజు (క్రీ.శ 1075 - 1108): పశ్చిమ చాళుక్యుల వారసత్వ పోరులో విక్రమాదిత్యుడి పక్షం వహించిన రెండో బేతరాజు ‘విక్రమ చక్రి’, ‘త్రిభువనమల్ల’ అనే బిరుదులు పొందాడు. విక్రమాదిత్యుడి అనుమతితో రెండో బేతరాజు తన సైన్యాధికారైన ‘వైజ్యనుడు’ చేసిన కృషితో ‘సబ్బి’ మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) ఆక్రమించుకున్నాడు. ముదిగొండ (ఖమ్మం) ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాజీపేట శాసనం ఇతడి వీరత్వం గురించి వర్ణిస్తుంది. అనమకొండ ప్రాంతంలో మొదటగా శివాలయాలను కట్టించిన కాకతీయరాజు రెండో బేతరాజు. శైవమతాన్ని ఆదరించిన మొదటి కాకతీయ రాజు కూడా ఇతడే. ఇతని కాలం నుంచే అనమకొండ కాకతీయులకు రాజధాని అయింది. రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157): రెండో ప్రోలరాజు కంటే ముందు దుర్గనృపతి పాలించాడు. ఇతడికి ‘చలమర్తిగండ’ అనే బిరుదు ఉంది. రెండో ప్రోలరాజు కాకతీయ రాజుల్లో మొదటి స్వతంత్ర రాజు. అనమకొండపై పశ్చిమ చాళుక్యుల పెత్తనాన్ని ఎదిరించాడు. మిగతా చాళుక్య సామంతరాజులనూ ఓడించాడు. వీరిలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పాలకుడు తైలరాజు, నేలకొండపల్లిని పాలించిన గోవిందరాజు, మంథని (కరీంనగర్) పాలకుడు గండరాజు, పోలవలస గిరిజన రాజ్యపాలకుడైన మేడరాజు, వేములవాడ ప్రభువు జగద్దేవుడు ముఖ్యులు. ఈ విధంగా మొత్తం తెలంగాణా ప్రాంతాన్ని జయించి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. ఇతడి విజయాల గురించి రుద్రదేవుడు వేయించిన అనమకొండ శాసనం, గణపాంబ వేయించిన గణపవరం శాసనం వివరిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు మండలాలను జయించాలనుకున్న రెండో ప్రోలరాజు అక్కడి పాలకుడైన బోధరాజు (వెలనాటి వంశం) చేతిలో మరణించాడు. ఈ విషయాన్ని ద్రాక్షారామం శాసనం తెలియజేస్తోంది. రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు): క్రీ.శ. 1158 నుంచి 1195 వరకు పాలించాడు. ప్రాంతీయ రాజ్యంగా ఉన్న కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. వెలనాటి రాజులను ఓడించి ద్రాక్షారామం, శ్రీశైలం, త్రిపురాంతకాలను ఆక్రమించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత దొమ్మరాజును (కరీంనగర్ ప్రాంతరాజు), మైలగిదేవుడు (జగిత్యాల ప్రాంత రాజు)లను ఓడించాడు. తెలంగాణలో పశ్చిమ చాళుక్యుల పాలనను పునఃప్రతిష్ట చేయాలనుకున్న కాలాచూరి బిజ్జలుడు, పోలవలస రాజు మేడరాజుతో కలిసి ప్రణాళిక రచించాడు. అది తెలిసిన రుద్రదేవుడు మేడరాజును ఓడించాడు. (మేడరాజు గోదావరిని దాటి అడవుల్లోకి పారిపోయినట్లుగా చెబుతారు). అప్పుడు బిజ్జలుడు వెనుకడుగు వేశాడు. రుద్రుడి ఈ విజయ యాత్రల్లో వెల్లకి గంగాధరుడనే మంత్రి పాత్ర గణనీయమైంది. దీనికి ప్రతిఫలంగా గంగాధరున్ని సబ్బి మండలానికి (కరీంనగర్ ప్రాంతం) అధిపతిగా చేశాడు. కాకతీయరాజ్యం తెలంగాణా ప్రాంతం దాటి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన గోదావరి నది, పశ్చిమాన కళ్యాణి, దక్షిణాన రాయలసీమ సరిహద్దుల వరకు విస్తరించింది. క్రీ.శ. 1176 నుంచి 1182 మధ్య కాలంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయంగా రుద్రుడు తన సైన్యాన్ని పంపాడు. కందూరు పాలకుడైన ఉదయచోళుడిని ఓడించిన రుద్రదేవుడు పానగల్లులో రుద్ర సముద్రం అనే చెరువును తవ్వించాడు. తర్వాత పాలమూరు, ధరణికోట, వెలనాడులోని చాలా ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్న యాదవరాజులు, కాకతీయుల మాదిరిగానే స్వతంత్ర రాజులై ‘దేవగిరి’ రాజధానిగా పాలిస్తున్నారు. వీరు కాకతీయుల రాజ్య విస్తరణ భవిష్యత్తులో తమకు ప్రమాదమని భావించారు. యాదవరాజు జైతుగి (జైత్రపాలుడు) క్రీ.శ. 1195లో కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్రదేవున్ని వధించాడు. కాకతీయ రుద్రుడు మంచి వాస్తు కళాభిమాని. అతడు అనమకొండలో రుద్రేశ్వరాలయాన్ని కట్టించాడు. పక్కనే వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించారు. ప్రసన్న కేశవాలయం వద్ద గంగాచీయ సరస్సును నిర్మించాడు. విశాల సామ్రాజ్యానికి రాజధానిగా అనమకొండ చిన్నదిగా ఉందని ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు స్వయంగా కవి. ఇతడు సంస్కృతంలో ‘నీతిసారం’ గ్రంథాన్ని రచించాడు. ఇతడు రెండో ప్రోలరాజు విజయాలను తెలుపుతూ క్రీ.శ. 1163లో ‘అచితేంద్ర’ రచించిన అనమకొండ శాసనాన్ని చెక్కించాడు. రుద్రదేవుడికి సంబంధించిన అనేక విషయాలు అనమకొండ శాసనం, గణపతి దేవుడు వేయించిన ఉప్పరపల్లి శాసనం, రుద్రమదేవి వేయించిన మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. రుద్రదేవుడి మరణం తర్వాత అతడి తమ్ముడు మహాదేవుడు అధికారంలోకి వచ్చాడు. మహాదేవుడు (క్రీ.శ. 1195-1199): యాదవరాజు జైతుగీపై పగ తీర్చుకోవడానికి దేవగిరిపై దండయాత్ర చేశాడు. ఇతడు జైతుగీ చేతిలో మరణించాడు. మహాదేవుడి కుమారుడైన గణపతిదేవుడు జైతుగీకి చిక్కి, బందీ అయ్యాడు. మహాదేవుడికి మైలాంబ, కుదాంబిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మైలాంబదేవి బయ్యారం శాసనాన్ని వేయించారు. -
వేయిస్తంభాల గుడిలో చోరీ
అద్దంకి, న్యూస్‌లైన్ : స్థానిక రెడ్డిరాజుల కాలం నాటి వేయిస్తంభాల గుడి(నగరేశ్వరాలయం)లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రహరీ, ముఖమండపం, ప్రధాన ఆలయాల గేట్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. విద్యావాసవీ అమ్మవారి నగలు కాజేశారు. ఆలయ అర్చకుడు నూతలపాటి కోటేశ్వరరావు అందించిన సమాచారం ప్రకారం.. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేస్తుంటారు. గురువారం సాయంత్రం పూజల అనంతరం యాథావిధిగా గుడి తలుపులు వేసి అర్చకుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రం చేసేందుకు స్వీపర్ నాగూరమ్మ వచ్చింది. ముఖ మండల తలుపునకు వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఆర్చకుడు కోటేశ్వరరావుకు సమాచారం అందించింది. ఆయన వచ్చి విద్యావాసవి మాత అమ్మవారి రెండు బంగారు తాళిబొట్లు, ఇత్తడి కిరీటం, రోల్డ్‌గోల్డ్ చైనులు, బయట ఉన్న ఐదు కిలోల గ్యాస్ స్తంభం అపహరించారని గుర్తించాడు. అంతేకాకుండా దేవాలయంలో ఉన్న గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి, అమ్మవారు, అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలు, దీపాలు, హారతి గరిటెను ఒక గోతంలో మూట గట్టి దాన్ని ఆలయ ప్రహరీ గోడపై పెట్టి తీసుకెళ్లే అవకాశం లేక దొంగలు పరారయ్యారు. దాన్ని తీసుకెళ్లి ఉంటే సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యేవి. ఇదే ఆలయంలో గతంలో రెండు సార్లు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్చకుని ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు వచ్చి ఆలయాన్ని పరిశీలించారు. -
మార్మోగిన ఓంకారనాదం
భక్తి ప్రపత్తులతో మహాశివరాత్రి వేడుకలు కిటకిటలాడిన శైవ క్షేత్రాలు హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : వేయిస్తంభాల దేవాలయంలో గురువా రం తెల్లవారుజామున 2.00 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక అర్చనలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు మణికంఠ శర్మ, సందీప్‌శర్మ ప్రణవ్ స్వామివారికి సుప్రభాతసేవ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషే కం, నిత్యవిధిహవనం నిర్వహించారు. 3.00 గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. కనుల పండువగా కల్యాణం సాయంత్రం 6.32 గంటలకు శ్రవణా నక్షత్రయుక్తగోధూళి లగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యా ణం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాల బియ్యం, శేష వస్త్రాలు సమర్పిచారు. 72 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ వారు శేషవస్త్రాల దాతగా వ్యవహరించారు. సాయంత్రం జరిగిన పూజలలో ఆర్డీఓ మధు, పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెం ట్ రావుల క్రిష్ణయ్య, సాంబశివకుమార్, మఠం బసవయ్య పాల్గొన్నారు. కల్యాణం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జాగహరణ ఉన్న భక్తుల కోసం రాత్రి 10.00 గంటల నుంచి తెల్లవారే వరకూ హరికథ కాలక్షేపం గావించారు. లింగోద్భవ పూజలో... రాత్రి 12.00 గంటలకు లింగోద్భవ కాలంలో వేదపండితులు భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు గుండు ప్రభాకర్, బ్రాహ్మణ సంఘం నాయకులు అయినవోలు వెంకటసత్యమోహన్, బజ్జూరి శ్యామ్‌సుందర్, ఫ్లవర్ డెకరేషన్ దాత కె.మాధవి, కపిల్ హోమ్స్ ఎండీ కృష్ణమోహన్, రూ.11వేలు చెల్లించిన దాతలు పాల్గొన్నారు. ప్రాతఃకాలపూజలలో జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీకాంత్, డీఆర్వో సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి వద్దిరాజు రాజేందర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్, రాజ్‌కుమార్, కృష్ణ, ప్రేమ్‌కుమార్ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఉదయం 10.00 గంటలకు హన్మకొండ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ దంపతులు, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు జయప్రకాశ్, మాజీ మంత్రి చందులాల్, శ్రీరుద్రేశ్వరున్ని దర్శించుకుని లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. -
సొరంగ మార్గాన్ని పరిశోధించాలి
హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్ : వేయిస్తంభాల దేవాలయం వాయువ్య మూలలో ఉన్న సొరంగమార్గంపై పరిశోధన లు జరగాలని, ఇప్పటికే చాలా నష్టం జరిగింద ని దేవాలయం చుట్టూ తవ్వకాలు జరపాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు అ న్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ ఉద యం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వర్రావు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు, వ్యాపారు లు, వేలాదిమంది విద్యార్థులు, మహిళలు రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన ప్రదోషకాల పూజల్లో వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు పాల్గొన్నారు. ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో డీఐజీలను ఆలయ మర్యాదలతో స్వా గతించారు. పూజల అనంతరం వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహాదాశీ ర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కా కతీయులు త్రికుటాలయంగా నిర్మించిన వేయిస్తంభాల దేవాలయం చాలా శక్తివంతమైందని, తనకు శక్తి కావాలనుకున్నప్పుడు ఈ దేవాల యాన్ని సందర్శిస్తుంటానని తెలిపారు. 8 వం దల సంవత్సరాల క్రితం నాటి శ్రీరుద్రేశ్వర శివలింగానికి పూజలు నిర్వహించే అవకాశం రావడం మన అదృష్టమన్నారు. దేవాలయం లో సూర్యనారాయణ, కేశవమూర్తుల విగ్రహా లను ప్రతిష్ఠించాల్సి ఉందన్నారు. పురావస్తుశా ఖ సెక్రటరీగా ఉన్నప్పుడు కల్యాణ మండపం త్వరగా పూర్తి కావాలని కేంద్రపురావస్తుశాఖ అధికారులను కోరానని గుర్తుచేశారు. దేవాలయ ఈఓ వద్దిరాజు రాజేందర్ క్యూలైన్ల ఏర్పాటును, ప్రసాద వితరణను పర్యవేక్షించారు.