మార్మోగిన ఓంకారనాదం
- భక్తి ప్రపత్తులతో మహాశివరాత్రి వేడుకలు
- కిటకిటలాడిన శైవ క్షేత్రాలు
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : వేయిస్తంభాల దేవాలయంలో గురువా రం తెల్లవారుజామున 2.00 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక అర్చనలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు మణికంఠ శర్మ, సందీప్‌శర్మ ప్రణవ్ స్వామివారికి సుప్రభాతసేవ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషే కం, నిత్యవిధిహవనం నిర్వహించారు. 3.00 గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి.
కనుల పండువగా కల్యాణం
సాయంత్రం 6.32 గంటలకు శ్రవణా నక్షత్రయుక్తగోధూళి లగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యా ణం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాల బియ్యం, శేష వస్త్రాలు సమర్పిచారు. 72 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ వారు శేషవస్త్రాల దాతగా వ్యవహరించారు. సాయంత్రం జరిగిన పూజలలో ఆర్డీఓ మధు, పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెం ట్ రావుల క్రిష్ణయ్య, సాంబశివకుమార్, మఠం బసవయ్య పాల్గొన్నారు. కల్యాణం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జాగహరణ ఉన్న భక్తుల కోసం రాత్రి 10.00 గంటల నుంచి తెల్లవారే వరకూ హరికథ కాలక్షేపం గావించారు.
లింగోద్భవ పూజలో...
రాత్రి 12.00 గంటలకు లింగోద్భవ కాలంలో వేదపండితులు భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు గుండు ప్రభాకర్, బ్రాహ్మణ సంఘం నాయకులు అయినవోలు వెంకటసత్యమోహన్, బజ్జూరి శ్యామ్‌సుందర్, ఫ్లవర్ డెకరేషన్ దాత కె.మాధవి, కపిల్ హోమ్స్ ఎండీ కృష్ణమోహన్, రూ.11వేలు చెల్లించిన దాతలు పాల్గొన్నారు. ప్రాతఃకాలపూజలలో జిల్లా అడిషనల్ ఎస్‌పీ శ్రీకాంత్, డీఆర్వో సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి వద్దిరాజు రాజేందర్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, రాజ్‌కుమార్, కృష్ణ, ప్రేమ్‌కుమార్ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
ఉదయం 10.00 గంటలకు హన్మకొండ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ దంపతులు, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు జయప్రకాశ్, మాజీ మంత్రి చందులాల్, శ్రీరుద్రేశ్వరున్ని దర్శించుకుని లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.