వేయి స్తంభాల కోసం.. వేయి కళ్లతో..
సాక్షి, హన్మకొండ: కాకతీయుల శిల్పకళకు అద్దంపట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా పునరుద్ధరణ పనులు మధ్యలో ఆగిపోయాయి. నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా పేరొందింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా జీవకళ ఉట్టిపడే భారీ నంది విగ్రహం.. దాని వెనుక అద్భుతమైన కల్యాణ మంటపం ఉండేది.
పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచింది. 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్ని ర్మించాలని నిర్ణయించింది. నాటి కాకతీయుల నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించి ఇందుకోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది.
పదేళ్లు గడిచినా..
కల్యాణ మంటపం పున:నిర్మాణ పను లు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మంటపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత రెండున్నరేళ్ల పాటు పనులు సాగలేదు. ఎట్టకేలకు 25-02-2010న మళ్లీ పనులు మొదల య్యాయి. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తిరిగి వినియోగించడానికి వీల్లేకుండా ఉన్న శిల లకు బదులుగా కొత్తగా 132 పిల్లర్లు, 160 బీమ్ శిలలు, శిల్పాలను చెక్కారు. కాకతీయులు ఉపయోగించిన ‘శాండ్‌బాక్స్’ టెక్నాలజీ ఆధారంగా పనులు మొదలె ట్టారు.
మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. దీనిపై ఏడు వరుసలు రాతి నిర్మాణంతో మొదలయ్యే ప్రదక్షిణ పథం నిర్మించారు. అనంతరం నాలుగు వరసలు ఉండే కక్షాసనం నిర్మించారు. ఆపై రాతిగోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న శిలలను పట్టి ఉంచేలా ముఖ్యమైన శిలలకు స్టెయిన్‌లెస్ స్టీల్ పట్టీలను అమర్చారు. గతంలో కాకతీయులు కరిగించిన ఇనుమును పోసిన పోతల్లోనే ఈ స్టెయిన్‌లెస్ స్టీలు పట్టీలు అమర్చారు. కిందామీదా పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ, మరోసారి నిధుల కొరత ఏర్పడటంతో గడిచిన మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మేడారం జాతర సమయంలో దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు భక్తులు చేరుకుంటారు. అప్పటి వరకైనా కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు పూర్తరుుతే... వేయిస్తంభాల గుడికి పునర్ వైభవం వస్తుంది.