Kakatiya architecture
-
8 మీటర్లు.. 70 టన్నులు.. వేయి స్తంభాల గుడి ఘన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల ఆధ్యాత్మిక, కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వేయి స్తంభాల దేవాలయం మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకోబోతోంది. ప్రత్యేక ఆకర్షణ అయిన వేయి స్తంభాల నాట్య మండపం పునరి్నర్మాణం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కోటీ 8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 70 టన్నుల బరువైన భారీ రాతి దూలాలను అమర్చే పనులు జరుగుతున్నాయి. మొత్తంగా జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) భావిస్తోంది. 2005లో విప్పదీసి.. వేయి స్తంభాల గుడిలో నాట్య మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని పునరుద్ధరించేందుకు 2005లో విప్పదీశారు. 18 నెలల్లో పునరి్నరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మధ్యలోనే వదిలేశారు. రాళ్లన్నింటికీ నంబర్లు వేసి మరోచోటికి తరలించారు. 2009లో పునర్నిర్మాణ పనులు తిరిగి మొదలైనా.. 80 శాతం పూర్తయ్యాక మళ్లీ ఆగిపోయాయి. ముందస్తు అనుమతి లేకుండా రెండు అద్దె క్రేన్లను వినియోగించారంటూ ఏఎస్ఐ అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపేయటంతో పనులు నిలిచిపోయాయి. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఈ పనులు ఊపందుకున్నాయి. ఏఎస్ఐ ప్రస్తుత సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్.కుమార్, ఆర్కియోలాజికల్ ఇంజనీర్ కృష్ణచైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం, స్తపతి శివకుమార్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి వేగంగా పనులు జరిపిస్తున్నారు. నాలుగు దూలాల కోసం నానా పాట్లు స్తంభాల పునరుద్ధరణ గతంలోనే పూర్తయింది. వాటిపై దూలాలు అమర్చాల్సి ఉంది. మొత్తం 163 దూలాల్లో నాలుగు అతి పెద్దవి. 8 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ దూలాల కోసం రాళ్లను వెతికి వెతికి.. చివరికి అమ్మవారిపేట క్వారీలో గుర్తించారు. అక్కడ కట్ చేయించి భారీ ట్రాలీల్లో ఆలయం వద్దకు తరలించారు. అక్కడ వాటిని కిందికి దింపి, కదిలించేందుకు 20 టన్నుల సామర్ధ్యమున్న ఆరు క్రేన్లను వినియోగించాల్సి వచ్చింది. వాటిని డిజైన్ ప్రకారం చెక్కుతున్నారు. ఐదారు రోజుల్లో 50 టన్నుల సామర్ధ్యమున్న రెండు హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో మండపంపైన అమర్చనున్నారు. వాటి మీద పైకప్పు రాళ్లను అమర్చితే పనులు పూర్తవుతాయి. కాగా.. దేవాలయం చుట్టూ దశాబ్దాలుగా కబ్జాలు చొచ్చుకువచ్చాయి. ఆ సమయంలోనే కొందరు స్థానికులు శిథిలావస్థకు చేరిన ఈ నాట్య మండపం పైకప్పు శిలలను ఎత్తుకుపోయారు. అలా 40 శాతం రాళ్లు మాయమయ్యాయి. వాటిని వేగంగా సిద్ధం చేస్తున్నారు. జాప్యంతో పెరిగిన ఖర్చు నాట్య మండపాన్ని విప్పదీయటం, పునరి్నర్మాణానికి వీలుగా డాక్యుమెంటేషన్ కోసం 2005లో రూ.3.80 కోట్లు ఖర్చు చేశారు. పునరి్నర్మాణానికి రూ.7 కోట్లు ఖర్చవుతాయని అప్పట్లో అంచనా వేశారు. 2011లో వ్యయాన్ని రూ.7.50 కోట్లకు పెంచారు. ఇదిలా పెరుగుతూపోయి ఖర్చు రూ.13.50 కోట్లకు చేరింది. ఇటీవల రూ.6 కోట్లను విడుదల చేయటంతో పనులు తుది దశకు చేరాయి. అప్పట్లో ఏనుగులతో తరలించి.. క్రీస్తుశకం 1163 సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పుడు రాతి దూలాలను కదిలించేందుకు ఆరు క్రేన్లను వాడుతున్న తరుణంలో.. అప్పట్లో వాటిని ఎలా తరలించారో అన్నది ఆసక్తిగా మారింది. దాదాపు కిలోమీటర్ పొడవునా మట్టికట్టను నిర్మించి దాని మీదుగా ఏనుగుల సాయంతో రాతి దూలాలను లాక్కొచ్చి ఉంటారని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
ఒక్క మెట్టు ఎక్కితే ‘వారసత్వ’ హోదా!
వెబ్‌డెస్క్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. కాకతీయ వైభవం వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జులై 16న ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్లైన్లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది బరిలో 255 కట్టడాలు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. శిల్పి పేరుతోనే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. శాండ్బాక్స్ టెక్నాలజీ రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. నీటిపై తేలియాడే ఇటుకలు ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ విశేషాలు ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. శిల్పకళ ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఐదేళ్ల శ్రమ రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ వరంగల్ చాప్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్ సైట్ టెంటిటీవ్ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చరిత్రకు సత్కారం ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
వేయి స్తంభాల కోసం.. వేయి కళ్లతో..
సాక్షి, హన్మకొండ: కాకతీయుల శిల్పకళకు అద్దంపట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా పునరుద్ధరణ పనులు మధ్యలో ఆగిపోయాయి. నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా పేరొందింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా జీవకళ ఉట్టిపడే భారీ నంది విగ్రహం.. దాని వెనుక అద్భుతమైన కల్యాణ మంటపం ఉండేది. పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచింది. 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్ని ర్మించాలని నిర్ణయించింది. నాటి కాకతీయుల నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించి ఇందుకోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది. పదేళ్లు గడిచినా.. కల్యాణ మంటపం పున:నిర్మాణ పను లు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మంటపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత రెండున్నరేళ్ల పాటు పనులు సాగలేదు. ఎట్టకేలకు 25-02-2010న మళ్లీ పనులు మొదల య్యాయి. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తిరిగి వినియోగించడానికి వీల్లేకుండా ఉన్న శిల లకు బదులుగా కొత్తగా 132 పిల్లర్లు, 160 బీమ్ శిలలు, శిల్పాలను చెక్కారు. కాకతీయులు ఉపయోగించిన ‘శాండ్బాక్స్’ టెక్నాలజీ ఆధారంగా పనులు మొదలె ట్టారు. మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. దీనిపై ఏడు వరుసలు రాతి నిర్మాణంతో మొదలయ్యే ప్రదక్షిణ పథం నిర్మించారు. అనంతరం నాలుగు వరసలు ఉండే కక్షాసనం నిర్మించారు. ఆపై రాతిగోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న శిలలను పట్టి ఉంచేలా ముఖ్యమైన శిలలకు స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను అమర్చారు. గతంలో కాకతీయులు కరిగించిన ఇనుమును పోసిన పోతల్లోనే ఈ స్టెయిన్లెస్ స్టీలు పట్టీలు అమర్చారు. కిందామీదా పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ, మరోసారి నిధుల కొరత ఏర్పడటంతో గడిచిన మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మేడారం జాతర సమయంలో దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు భక్తులు చేరుకుంటారు. అప్పటి వరకైనా కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు పూర్తరుుతే... వేయిస్తంభాల గుడికి పునర్ వైభవం వస్తుంది.