సాక్షి, హైదరాబాద్: కాకతీయుల ఆధ్యాత్మిక, కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వేయి స్తంభాల దేవాలయం మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకోబోతోంది. ప్రత్యేక ఆకర్షణ అయిన వేయి స్తంభాల నాట్య మండపం పునరి్నర్మాణం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కోటీ 8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 70 టన్నుల బరువైన భారీ రాతి దూలాలను అమర్చే పనులు జరుగుతున్నాయి. మొత్తంగా జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) భావిస్తోంది.
2005లో విప్పదీసి..
వేయి స్తంభాల గుడిలో నాట్య మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని పునరుద్ధరించేందుకు 2005లో విప్పదీశారు. 18 నెలల్లో పునరి్నరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మధ్యలోనే వదిలేశారు. రాళ్లన్నింటికీ నంబర్లు వేసి మరోచోటికి తరలించారు. 2009లో పునర్నిర్మాణ పనులు తిరిగి మొదలైనా.. 80 శాతం పూర్తయ్యాక మళ్లీ ఆగిపోయాయి. ముందస్తు అనుమతి లేకుండా రెండు అద్దె క్రేన్లను వినియోగించారంటూ ఏఎస్‌ఐ అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపేయటంతో పనులు నిలిచిపోయాయి. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఈ పనులు ఊపందుకున్నాయి. ఏఎస్‌ఐ ప్రస్తుత సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్.కుమార్, ఆర్కియోలాజికల్ ఇంజనీర్ కృష్ణచైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం, స్తపతి శివకుమార్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి వేగంగా పనులు జరిపిస్తున్నారు.
నాలుగు దూలాల కోసం నానా పాట్లు
స్తంభాల పునరుద్ధరణ గతంలోనే పూర్తయింది. వాటిపై దూలాలు అమర్చాల్సి ఉంది. మొత్తం 163 దూలాల్లో నాలుగు అతి పెద్దవి. 8 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ దూలాల కోసం రాళ్లను వెతికి వెతికి.. చివరికి అమ్మవారిపేట క్వారీలో గుర్తించారు. అక్కడ కట్ చేయించి భారీ ట్రాలీల్లో ఆలయం వద్దకు తరలించారు. అక్కడ వాటిని కిందికి దింపి, కదిలించేందుకు 20 టన్నుల సామర్ధ్యమున్న ఆరు క్రేన్లను వినియోగించాల్సి వచ్చింది. వాటిని డిజైన్ ప్రకారం చెక్కుతున్నారు. ఐదారు రోజుల్లో 50 టన్నుల సామర్ధ్యమున్న రెండు హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో మండపంపైన అమర్చనున్నారు. వాటి మీద పైకప్పు రాళ్లను అమర్చితే పనులు పూర్తవుతాయి. కాగా.. దేవాలయం చుట్టూ దశాబ్దాలుగా కబ్జాలు చొచ్చుకువచ్చాయి. ఆ సమయంలోనే కొందరు స్థానికులు శిథిలావస్థకు చేరిన ఈ నాట్య మండపం పైకప్పు శిలలను ఎత్తుకుపోయారు. అలా 40 శాతం రాళ్లు మాయమయ్యాయి. వాటిని వేగంగా సిద్ధం చేస్తున్నారు.
జాప్యంతో పెరిగిన ఖర్చు
నాట్య మండపాన్ని విప్పదీయటం, పునరి్నర్మాణానికి వీలుగా డాక్యుమెంటేషన్ కోసం 2005లో రూ.3.80 కోట్లు ఖర్చు చేశారు. పునరి్నర్మాణానికి రూ.7 కోట్లు ఖర్చవుతాయని అప్పట్లో అంచనా వేశారు. 2011లో వ్యయాన్ని రూ.7.50 కోట్లకు పెంచారు. ఇదిలా పెరుగుతూపోయి ఖర్చు రూ.13.50 కోట్లకు చేరింది. ఇటీవల రూ.6 కోట్లను విడుదల చేయటంతో పనులు తుది దశకు చేరాయి.
అప్పట్లో ఏనుగులతో తరలించి..
క్రీస్తుశకం 1163 సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పుడు రాతి దూలాలను కదిలించేందుకు ఆరు క్రేన్లను వాడుతున్న తరుణంలో.. అప్పట్లో వాటిని ఎలా తరలించారో అన్నది ఆసక్తిగా మారింది. దాదాపు కిలోమీటర్ పొడవునా మట్టికట్టను నిర్మించి దాని మీదుగా ఏనుగుల సాయంతో రాతి దూలాలను లాక్కొచ్చి ఉంటారని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment