తీరొక్క రంగులు. వేర్వేరు రకాలు. వాటన్నింటా సుగంధమే. నిర్జన ప్రదేశాల్లో జన్మ తీసుకొని తంతెలు తంతెలుగా నిర్మితమయ్యే పుష్పాల విలాసమే బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, హన్మకొండ: తెలంగాణలోని సంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఈపండుగ వచ్చిందటే ఆడపడుచులకు ఎనలేని ఆనందం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్రమాస అంటారు. బతుకమ్మ పండుగ పెత్రమాసనాడు ప్రారంభమై మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆరో రోజు అర్రెం అంటారు. ఈరోజు బతుకమ్మను పేర్చడం గానీ ఆడడం గానీ చేయరు.
ఆరో రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. బతుకమ్మను పేర్చడానికి వరుసగా పూలను సేకరిస్తుంటారు. ఆకారణంగా ఆరో రోజు పూలను సేకరించకుండా ఉండడానికే అర్రెం అనే నియమం వచ్చినట్లు జానపద పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మను పేర్చేందుకు తంగేడు, గునుగు, సీతజడ, బంతి, కట్ల, మందార, మొల్ల, గోరంట, ముళ్లగోరంట, పట్నం బంతి, తురకబంతి, చామంతి, కలువ తామర, గన్నేరు, ఉద్రాక్ష, జాజి, గుమ్మడి, సంపెంగ తదితర పూలను సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు.
ఎంగిలిపూలు అని ఎందుకంటారంటే..
బతుకమ్మ తయారీకోసం ఒకరోజు ముందే పూలను సేకరిస్తారు. పూలు తీసుకొచ్చిన వారింట్లో ఈపూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతున్నారు. ముందు రోజు పూలను సేకరించడం వల్ల మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చుకొని బతుకమ్మను పేర్చుతున్నప్పుడు నోటితో పూలను ఊది వాటిని పేరుస్తారు. అలా పూలను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతుంటారు. పెత్రమాస రోజు ఉదయమే లేచి చనిపోయిన పెద్దలకు నివేదనలు చేసి అనంతరం భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు
పితృ అమావాస్య..
పెత్రమాసనే పితృ అమావాస్య అని, మహాలయ అమావాస్య అని పిలుస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు.
పూల దారులు
ఆదివారం పెత్రమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూల సిబ్బిలు, రంగులు, తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు మొదలైనవి కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో శనివారం రాత్రి రోడ్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీ్టట్, అంబేడ్కర్ సెంటర్, వరంగల్‌లోని పిన్నవారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశీబుగ్గ, గోపాలస్వామి గుడి, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగాయి.
200 ఏళ్ల నాటి బతుకమ్మ పాట
శ్రీలక్ష్మీ దేవియు చందమామ – సృష్టి బతుకమ్మాయె చందమామ
పుట్టిన రీతి జెప్పె చందమామ – భట్టు నరసింహకవి చందమామ
ధర చోళదేశమున చందమామ– ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు చందమామ– అతి సత్యవతి యంద్రు చందమామ
నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ
వారు శూరులయ్యె చందమామ – వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యమునుబాసి చందమామ – దాయాదులను బాసి చందమామ
వనితతో ఆరాజు చందమామ – వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ
పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ
సత్యవతి గర్భమున చందమామ – జన్మించె శ్రీలక్ష్మీ చందమామ
అంతలో మునులునూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ
కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ
అత్రి వశిష్ఠులూ చందమామ – ఆ కన్నియను జూచి చందమామ
బతుకు గనె ఈతల్లి చందమామ – బతుకమ్మ యనిరంత చందమామ
నేడు పాటల పోటీలు
శ్రీరాధేశ్యాం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొని విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులు మహిళలు ప్రశాంతంగా దేవాలయంలో ఆడుకోవచ్చని తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment