ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఏడు శతాబ్దాల విరామం తర్వాత వేయి స్తంభాల దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న కళ్యాణ మంటపంలో శివపార్వతుల కళ్యాణం జరగబోతోంది. కాకతీయుల హయాం తర్వాత మళ్లీ ఇంతకాలానికి కళ్యాణ మంటపం కళకళలాడబోతోంది. విఖ్యాత వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మంటపం పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో, సెప్టెంబరులో దాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే శివరాత్రి వేడుకలను అందులోనే నిర్వహించాలని భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్ : కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాలతో రుద్రేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు. ఓవైపు దేవాలయం, దానికి మరోవైపు కళ్యాణమంటపాన్ని అద్భుత శిల్పకళా వైభవంతో రూపొందించారు. కాకతీయుల ఇలవేల్పుగా భాసిల్లిన పరమశివుడికి ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేవి.
డెక్కన్ ప్రాంతాన్ని వశం చేసుకునే సమయంలో తుగ్లక్ సేనలు దీన్ని పాక్షికంగా ధ్వంసం చేశాయని చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో కళ్యాణమంటపం పైకప్పు 40 శాతం కూలిపోయింది. దాంతో ఆ శిథిల మంటపంలో ఇక వేడుకలు నిర్వహించటం ఆపేశారు. అంతే.. మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇప్పుడు ఆ మంటపాన్ని పునర్నిర్మించటంతో తిరిగి వేడుకల నిర్వహణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
చివరి దశలో పనులు..
దాదాపు 18 ఏళ్ల క్రితం కళ్యాణ మంటపాన్ని పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో పూర్తిగా విప్పదీశారు. అందులోని రాళ్లకు నంబర్లు వేసి పద్మాక్షి గుట్ట వద్ద ఉంచారు. కానీ పనులు ముందుకు సాగలేదు.మూడేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం దృష్టి సారించి వేగంగా పనుల నిర్వహణ ప్రారంభించింది. ఇప్పుడు ప్రధాన నిర్మాణ పనులు పూర్తికాగా, వారం రోజులుగా పైకప్పు పనులు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ఆ పనులు కొలిక్కి తెచ్చి సెప్టెంబరులో మంటపాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నాటి క్వారీ నుంచే ఇప్పుడూ రాళ్ల వినియోగం..
హనుమకొండకు చేరువగా ఉన్న అమ్మవారి పేట క్వారీ నుంచి మంటప పునర్నిర్మాణ పనులకు రాళ్లను తెచ్చి వాడుతున్నారు. అప్పట్లో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాలకు ఈ గుట్ట రాయినే వాడేవారు. నాడు రాళ్లను తొలిచేందుకు చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దాదాపు 60 టన్నుల బరువున్న ఓ భారీ బండరాయిని ఇటీవలే మంటపం వద్దకు తరలించారు. దాన్ని పైకప్పుపై అమర్చనున్నారు.
ఆ గుండుపై 800 ఏళ్ల కింద తొలిచినప్పటి రంధ్రాల జాడలు ఇంకా ఉండటం విశేషం. అదే రాయి భాగాన్ని ఇప్పుడు మళ్లీ వేయిస్తంభాల కళ్యాణ మంటపానికి వినియోగిస్తుండటం యాదృచ్ఛికం. ఈ మంటపానికి సంబంధించి 163 బీమ్‌లకు గానూ 28 జాడ లేకుండా పోయాయి. కూలిన తర్వాత ప్రజలు వాటి ముక్కలను తరలించుకుపోయారు.
ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో ఒక్కోటి 8 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు, 30 టన్నుల బరువుండే 8 బీమ్‌ల ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. వాటిపై 32 పైకప్పు సల్పలను పరచనున్నారు. ఈ సల్ప రాళ్లు ఒక్కోటి 15 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి.
పనుల్లో తమిళనాడు శిల్పులు
తమిళనాడుకు చెందిన శివకుమార్ స్థపతి ఆధ్వ ర్యంలో అదే రాష్ట్రానికి చెందిన 28 మంది శిల్పులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్రప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు కాగా, నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి మరో రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆ తర్వాత దాని చుట్టూ సుందరీకరణ, ఇతర పనులకు మిగతావి ఖర్చు చేయనున్నారు. ఏఎస్‌ఐ తెలంగాణ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్ కుమార్, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
అలనాటి శైలికి తేడా రానివ్వం
‘కాకతీయుల కాలంలో ఏ శైలిని వినియోగించారో ఆ శైలికి ఏమాత్రం తేడా రాకుండా రాళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. అలనాటి నిర్మాణం మళ్లీ కళ్ల ముందుంచేందుకు అహరహం శ్రమిస్తున్నాం. ఆగస్టు చివరి నాటికి కళ్యాణ మంటపం సిద్ధమవుతుంది’ –శివకుమార్, స్థపతి
Comments
Please login to add a commentAdd a comment