రామప్పా.. నువ్వే దిక్కప్పా! | yunesko did't find out Heritage status for ramappa and warangal temple | Sakshi
Sakshi News home page

రామప్పా.. నువ్వే దిక్కప్పా!

Published Wed, Mar 9 2016 7:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

రామప్పా.. నువ్వే దిక్కప్పా!

రామప్పా.. నువ్వే దిక్కప్పా!

‘ఓరుగల్లు’కు చేజారిన వారసత్వ హోదా
వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోటలను గుర్తించలేమన్న యునెస్కో
కట్టడాలకు సమీపంలోని ఆక్రమణలే కారణం
కట్టడాలు గొప్పవే.. నిబంధనలను కాదని హోదా ఇవ్వలేమని వెల్లడి
ఇక రామప్ప దేవాలయంపై ప్రభుత్వ దృష్టి
పక్కాగా డోసియర్ రూపొందించి మళ్లీ దరఖాస్తు
ఈసారి హోదా తథ్యమన్న ఆశాభావం

ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణకు చోటు దక్కినట్టే దక్కి త్రుటిలో చేజారిపోయింది. పరాక్రమానికే కాకుండా నిర్మాణ రంగంలో గొప్ప పరిజ్ఞానాన్ని చూపిన కాకతీయుల ఘన చరిత్రకు ప్రపంచ వారసత్వ సంపద హోదా చివరి నిమిషంలో వెనక్కి పోయింది. వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోటలకు వారసత్వ హోదా ఇవ్వలేమని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ తేల్చి చెప్పింది. గొప్ప చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ నిర్మాణాల చుట్టూ వెలిసిన ఆక్రమణలే దీనికి కారణమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రామప్ప దేవాలయంపై దృష్టి సారించింది. వేయి స్తంభాల గుడికి తీసిపోని ఖ్యాతి ఉన్న ఈ ఆలయానికి ఆక్రమణల బెడద లేనందున... దీనిని ‘హోదా’ కోసం ప్రతిపాదిస్తూ తాజాగా యునెస్కో తలుపుతట్టింది.   - సాక్షి, హైదరాబాద్

కొంప ముంచిన ‘వంద మీటర్ల’ నిబంధన
వరంగల్ కోట, వేయిస్తంభాల గుడులకు ప్రపంచ వారసత్వ హోదా కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం యునెస్కోకు ప్రతిపాదనలు చేసింది. దీంతో ప్యారిస్ నుంచి ఆ సంస్థ నిపుణులు వరంగల్‌కు వచ్చి కట్టడాలను పరిశీలించారు. ఈ నిర్మాణాలు అత్యద్భుతంగా ఉన్నాయని కీర్తించారు కూడా. దాంతో గుర్తింపు ఖాయమని భావించారు. కానీ ఆ నిర్మాణాలకు వంద మీటర్లలోపు భారీగా ఆక్రమణలు ఉన్నాయని పేర్కొంటూ ‘హోదా’ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రపంచ వారసత్వ గుర్తింపును కేటాయించే విషయంలో ‘యునెస్కో’ నిబంధనలను కచ్చితంగా పాటిస్తుంది. నిర్ధారిత కట్టడం/స్థలానికి వంద మీటర్ల పరిధిలో, ఆ కట్టడంతో సంబంధం లేని ఎలాంటి నిర్మాణాలు ఉండరాదు. దానిని నిషేధిత ప్రాంతంగా పేర్కొంటుంది. 200 మీటర్ల పరిధిని నిరోధిత ప్రాంతంగా పరిగణిస్తుంది. తాత్కాలిక నిర్మాణాలు తప్ప పక్కా నిర్మాణాలు ఉండకూడదు. దీంతో చేతిదాకా వచ్చిన వారసత్వ హోదా చేజారిపోయింది.

 ఇవీ రామప్ప ప్రత్యేకతలు
నిర్మాణం: 11వ శతాబ్దం, శిల్పి రామప్ప.
నేతృత్వం: కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో రేచర్ల రుద్రుడి పర్యవేక్షణలో నిర్మాణం.  నిర్మాణ కాలం: దాదాపు 40 ఏళ్లు
ప్రత్యేకతలు: సాండ్ బాక్స్ (ఇసుక పొర) టెక్నాలజీ వినియోగం. నీటిలో తేలే ఇటుకలు, భిన్న రకాలైన రాళ్ల వాడకం, కాలక్రమంలో ప్రధాన బీమ్ ధ్వంసమైనా ఇసుమంతైనా నష్టపోని కట్టడం. సప్తస్వరాలు పలికే రాయి, వెంట్రుకలు దూరేంత సందులతో కూడిన నగిషీలు, అద్దాన్ని మరిపించేలా రాళ్లను నున్నగా చెక్కడం.
హోదాతో ఉపయోగం: యునెస్కో గుర్తింపు వస్తే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. యువతకు ఉపాధి అవకాశాలే కాకుండా విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. కట్టడం పర్యవేక్షణ, అభివృద్ధి, పరిరక్షణకు యునెస్కో నిధులు ఇస్తుంది.

రామప్పకు హోదా తథ్యం!
‘ఓరుగల్లు’కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎలాంటి ఆక్రమణలు లేని రామప్ప దేవాలయాన్ని నమ్ముకుంది. వాస్తవానికి యునెస్కోకు చేసిన తొలి ప్రతిపాదనలో రామప్పను కూడా చేర్చింది. కానీ ఒకే ప్రతిపాదన (డోసియర్)లో ఉన్నందున అది కూడా తిరస్కరణకు గురికావాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఒక్క రామప్ప దేవాలయాన్ని మాత్రమే ప్రతిపాదించాలని తాజాగా నిర్ణయించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సహకారంతో పురావస్తు శాఖ ఓ కన్సల్టెన్సీతో ప్రత్యేక డోసియర్ రూపొందించి యునెస్కోకు దరఖాస్తు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement