కల్యాణ మండపం ఏమాయె..! | kalyana mandapam in thousand pillar temple | Sakshi
Sakshi News home page

కల్యాణ మండపం ఏమాయె..!

Published Mon, Nov 21 2016 12:35 PM | Last Updated on Fri, Aug 31 2018 9:02 PM

కల్యాణ మండపం ఏమాయె..! - Sakshi

కల్యాణ మండపం ఏమాయె..!

పురావస్తుశాఖ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించిన హైకోర్టు జడ్జి రాజశేఖర్‌
 
హన్మకొండ కల్చరల్‌ : వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో కల్యాణ మండపం 15 నెలల్లో నిర్మిస్తామని పురావస్తుశాఖ 2008లో హైకోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి రాజశేఖర్‌ గుర్తు చేశారు. ఇప్పటికీ దాన్ని నిర్మించకపోవడం ఆశాఖ నిర్లక్ష్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజశేఖర్‌ దంపతులు దర్శించుకున్నారు. దేవాలయ ఈఓ వద్దిరాజు రాజేందర్‌రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు ఆలయమర్యాదలతో ఆయన్ను స్వాగతించారు. పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్రా్తలు, మహాదాశీర్వచనం ఇచ్చారు. 8 ఏళ్ల క్రితం దేవాలయ కల్యాణమండపం విషయమై భక్తులు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని జడ్జి తెలిపారు. నాడు తాను కేంద్ర పురావస్తుశాఖ తరఫున వాదించానని తెలిపారు. ఆ సమయంలో పురావస్తుశాఖ అధికారులు 15 నెలల్లో పూర్తిచేస్తామని హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ దాన్ని పూర్తి చేయకపోవడం కోర్టును నిర్లక్ష్యం చేసినట్లేనన్నారు. ఇప్పుడు ఎవరైనా హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేస్తే పురావస్తుశాఖ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జడ్జి వెంట సీఐ సంపత్‌రావు, పోలీస్‌ అధికారులు ఉన్నారు. 
 
ఘనంగా లక్షబిల్వార్చన
కార్తీకమాసోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మహిళలు దేవాలయప్రాంగణంలో దీపదానాలు చేశారు. బహుళ షష్టి తిథిని పురస్కరించుకొని స్వామివారిని బిల్వ దళాధిపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ , అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ, పానుగంటి ప్రణవ్‌లు మహాగణపతికి అభిషేకం జరిపారు. శ్రీరుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శ్రీమహాలక్ష్మి ఉద్భవించిన మారేడుదళాలతో లక్షబిల్వార్చన చేశారు. ప్రముఖ శివభక్తుడు దాత ముపదాసు సురేష్‌బాబు దంపతులు దీనికి యాజమాన్యం వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. ప్రదోషకాల పూజలలో జిల్లా ఫోర్త్‌ క్లాస్‌ కోర్టు జడ్జి గోవిందలక్ష్మి పాల్గొన్నారు. శ్రీరుద్రేశ్వరునికి పూజలు నిర్వహించారు. 
 
నేడు..
కార్తీకమాసం నాల్గో సోమవారం రుద్రేశ్వరునికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని ప్రధానార్చకులు తెలిపారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకోవచ్చునని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement