వ్యాధుల ముప్పు పొంచి ఉంది
-
వైద్య ఆరోగ్యశాఖలో సెలవులు రద్దు
-
సమీక్షలో కలెక్టర్ యోగితారాణా
నిజామాబాద్‌అర్బన్ :
కురుస్తున్న భారీ వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. శుక్రవారం ఆమె తన తన చాంబర్‌లో అత్యవసర వైద్య సేవలపై సమీక్షించారు. వర్షం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్యులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేసిందని తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 24 గంటల వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఆరోగ్య కేంద్రాల వైద్యులను అప్రమత్తం చేసి ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక బృందాలు....
జిల్లాలో వరద ప్రభావం ఉన్న జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, పిట్లం, ఆర్మూర్, సిరికొండ, ధర్పల్లి ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 14 మంది వైద్యులను ఇప్పటికే పిట్లం, బిచ్కుంద ప్రాంతాలకు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. వైద్యులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అనుకోకుండా ఏదైనా ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కొనేదుకు మరో 4 బృందాలను అందుబాటులో ఉంచారు.
వ్యాధుల ముప్పు
వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచింది. దీంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ ఏడాది జిల్లాలో 96 డెంగీ, 130 మలేరియా, 210 అతిసార కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవించాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాల వల్ల అతిసార ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. నీటి నిల్వ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమల ప్రభావం పెరిగి మలేరియా, డెంగీ ప్రబలే ప్రమాదముంది. దీంతో వ్యాధుల నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.
సిద్ధంగా ఉన్నాం
– వెంకట్, డీఎంహెచ్‌వో
వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. దీనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. వైద్యులు, వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేశాం.