మూడు వర్గాలు...ఆరు గ్రూపులు!
సాక్షి ప్రతినిధి, కడప:
తెలుగుదేశం పార్టీలో మూడు గ్రూపులు...ఆరు వర్గాలు రాజ్యమేలుతున్నాయి. పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో విఫలం కాగా, ప్రాభావం కోసం పాకులాట అధికమైంది. క్రమంతప్పకుండా ఏదో నియోజకవర్గం నుంచి అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. ఫిరాయింపు నేతలు సృష్టించే సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే అధినేతకు తెలుగుతమ్ముళ్లు శిరోభారంగా మారారు. ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం రానున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసేందుకు సన్నద్ధమయ్యారు. టీడీపీలో అప్పటికప్పుడు పసువు కండువా కప్పుకున్న వారికే అధిక ప్రాధాన్యత దక్కుతోందనే వాదన బలపడుతోంది. ఈక్రమంలో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. సమన్యాయం సాధించడంలో అధ్యక్షుడుగా శ్రీనివాసులరెడ్డి విఫలమయ్యారనే వాదనను ఓవర్గం తెరపైకి తెస్తోంది. ఈక్రమంలోనే మంత్రి గంటాకు ఫిర్యాదుల మోత తప్పదనే చెప్పవచ్చు.
తీవ్రరూపం దాల్చిన వర్గపోరు
టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఓవైపు అనుభవలేమి, మరోవైపు వర్గపోరు పట్టిపీడిస్తున్నాయని ఓ వర్గం తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. సొంత నియోజకవర్గం రాయచోటి నుంచి సైతం కార్యకర్తలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగుల్లో ప్రస్తుతం పతాకస్థాయిలో అంతర్గతపోరు నడుస్తోంది. బద్వేలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన విజయజ్యోతి ఏకంగా ప్రొద్దుటూరులో నిలదీశారు. అదేబాటలో కడప అభ్యర్థి దుర్గాప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. కరివేపాకులా వాడుకోవడం మినహా గుర్తింపు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారనే ఆవేదన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ట్రబుల్‌షూటర్‌గా పనిచేయాల్సిన వ్యక్తి ‘ట్రబుల్ మ్యాంగర్’గా తయారైయ్యారని మరోవర్గం ఇప్పటికే పలు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జంప్‌జిలానీలకే ప్రాధాన్యం
పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన వారికంటే ఫిరాయింపుదారులకు అధికప్రాధాన్యత దక్కుతుండని తమ్ముళ్లు బహిరంగంగానే ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతల చర్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వారి ఆరోపన. కడపలో గుర్తింపు కోసం ఫిరాయింపులకు పాల్పడిన వారికే ఎస్‌డీఎఫ్ గ్రాంటు ఏకపక్షంగా కేటాయించారనే ఆరోపణలు ఓవర్గం నుంచి విన్పిస్తున్నాయి. పాతకడప, ఆలంఖాన్‌పల్లె, కోఆపరేటివ్ కాలనీ, చిన్నచౌక్ పరిధిల్లో ఉన్న ఆయా నాయకులు సూచనలకు అనుగుణంగానే మొత్తం వ్యవహారం నడుస్తోందని వారు వాపోతున్నారు. ఒక సామాజికవర్గానికే అవకాశం కల్పించారని ఫిర్యాదుల పరంపర తెరపైకి వచ్చాయి. ఈక్రమంలో శుక్రవారం మంత్రి నేతృత్వంలో నిర్వహించే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమేరకు జమ్మలమడుగు, కడప, బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు వారి ఆవేదనను వెల్లడించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.