భీమ్‌గల్:
వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
Published Fri, Sep 16 2016 12:10 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బడాభీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్సై సుఖేందర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు లంక రమేశ్ (36)కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రమేశ్ తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తీవ్ర కరువు నేపథ్యంలో రెండేళ్లుగా సాగు చేస్తున్న పంటలు చేతికందక సుమారు ఆరు రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ ఏడు కూడా వరి పంట సాగు చేశాడు. అయితే, నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక తనకున్న రెండెకరాలలో అర ఎకరం పొలాన్ని సైతం అమ్మేశాడు. అయినా అప్పులు పూర్తిగా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రెండ్రోజుల క్రితం తన పొలంలోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన పరిసర పొలాల రైతులు హుటాహుటిన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మరో ఘటనలో వివాహిత..
డిచ్‌పల్లి: కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. డిచ్‌పల్లి ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లికి చెందిన ఎర్ర లక్ష్మి (50) కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతోంది. నొప్పి మరీ ఎక్కువ కావడంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జీవితంపై విరక్తి చెంది..
మద్నూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మద్నూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మేనూర్‌కు చెందిన సాబ్టె సాయిలు (33)కు భార్య, ఇద్దరు కుమారులు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మద్నూర్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement