
క్షణికావేశం.. యావజ్జీవిత శోకం
రెండు కుటుంబాల మధ్య భూ తగాదా.. ఒకరికి గర్భశోకాన్ని మరొకరికి ‘జీవిత’ క్లేశాన్ని మిగిల్చింది.
రోలుగుంట మండలం వి.శరభవరం గ్రామంలో 2008లో పంచాడ రాజులు, ఊట చినరాజు వర్గాల మధ్య భూవివాదం నెలకొంది. చినరాజులపై కక్షతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అతని కుమారుడు శేఖర్(4)ను పంచాడ రాజులు, అతని కుటుం బానికి చెందిన పంచాడ నూకాలతల్లి (40), యర్రయ్యమ్మ(50), లక్ష్మి (28) పీక నులిపి హత్య చేశారు. తరువాత సమీప చెరువులో కప్పారు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో చినరాజులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సీహెచ్ శ్యామలరావు, ఎస్సై జి.ప్రకాశరావు నేతృత్వంలోని పోలీసు బృందం చెరువులో బాలుడి మృతదేహాన్ని కనుగొంది. ఈ కేసులో ముద్దాయిలు నలుగురినీ అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ అనకాపల్లి అదనపు జిల్లా కోర్టులో జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.పి. నాయుడు పోలీసుల తరపున వాదనలు వినిపించారు. నిందితులు నలుగు రూ బాలుడిని చంపినట్టు నిరూపణ కావడంతో జిల్లా అదనపు న్యాయమూర్తి బి.నాగేంద్రరావు అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. మొదటి ముద్దాయి పంచాడ రాజులు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. సహ ముద్దాయిలు పంచాడ నూకాలతల్లి, యర్రయ్యమ్మ, లక్ష్మిలను పోలీసులు కారాగారానికి తరలించారు. ఆరునెలల్లోగా వీరి నుంచి వసూలు చేసిన రూ.30 వేలను మృతి చెందిన బాలుని తల్లి పార్వతికి అందజేయాలని జడ్జి తీర్పునిచ్చారు.