ఔరా! వర్షం నీళ్లలో వెంకన్న ఆలయమా!
- మూసుకుపోయిన పాతతూములు
- మరమ్మతులకు సాహసించని టీటీడీ
తిరుమల : చినుకు రాలితే అందరికీ సంతోషమే. అదే చినుకు తిరుమల వెంకన్న ఆలయంపై రాలితే టీటీడీ అధికారులు పరుగులు తీస్తుంటారు. ఆలయంలోని పురాతన తూములు పూడిపోయి నీరు నిలిచిపోవడమే ఇందుకు కారణం. దీనిపై టీటీడీ తర్జనభర్జన పడుతోంది.
2 వేల సంవత్సరాల పూర్వం ఆలయ నిర్మాణం
శ్రీవారి ఆలయ విస్తీర్ణం 2.20 ఎకరాలు. తూర్పు, పడమర 414, ఉత్తర, దక్షిణంగా 263 అడుగులు. మొత్తం 1354 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పురాణాల ప్రకారం ఆలయాన్ని ఐదువేల యేళ్లకు ముందు తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టు ఉంది. టీటీడీ చారిత్ర ఆధారాలు, శిలాశాసనాల ప్రకారం రెండు వేల సంవత్సరాల ముందు ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో వెయ్యి సంవత్సరాల వరకు గర్భాలయం ప్రాకారం, 11వ శతాబ్దంలో ఆనంద నిలయ ప్రాకారం, 12వ శతాబ్దంలో సంపంగి ప్రకారం, వెండివాకిలి గోపురం, 13వ శతాబ్దం తర్వాత మహద్వార గోపుర,ప్రాకార, నిర్మాణాలు జరిగాయి.
పురాతన తూములు పూడిపోయాయా?
ఆలయ నిర్మాణంలో శిల్పులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా నీటి వ్యవస్థకోసం తూములు నిర్మించారు. వాస్తురీత్యా ఉత్తర ఈశాన్య దిశలోని ఆనంద నిలయం ప్రాకారంలోని యోగనృసింహస్వామి ఆలయం పక్క నుంచి వెండివాకిలి ప్రాకారం వద్ద, ఐనా మహల్ ముందుభాగం నుంచి మహద్వార ప్రాకారం వద్ద ఉన్న గొల్ల మండపం ముందు వరకు తూములు నిర్మించారు. అయితే, 14 వ శతాబ్దం తర్వాత ఆలయం ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సరికొత్త నిర్మాణాలు వెలిశాయి. మహంతుల కాలంతో పాటు టీటీడీ ఏర్పడిన తర్వాత ఆలయంలో సహజసిద్ధంగా ఉండే మట్టి, రాతి బండలపై క్రమంగా గ్రానైట్ బండలు అమర్చటం పెరిగింది. దీనివల్ల తూముల్లో నిర్మాణాల కారణంగా ఏర్పడిన వృథా, రాళ్లు, గోనె సంచులు పేరుకుపోయాయని నిపుణుల చెబుతున్నారు. వాటితోపాటు నిత్యం ఆలయంలో తయారు చేసే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల వృథా కూడా ఈ తూముల్లో పేరుకుపోయిందని చెబుతున్నారు.
నాలుగేళ్లుగా ఆలయంలో నిలుస్తున్న వర్షపు నీరు
ఆలయంలో నిత్యంవాడే నీరు తూముల గుండా వెలుపలకు ప్రవహిస్తోంది. భారీ స్థాయిలో వర్షం వస్తే చాలు యోగనృసింహస్వామి ఆలయం, ఐనా మహల్ ముందు వర్షం నీరు మోకాటిలోతులో నిలుస్తున్నాయి. నాలుగేళ్లుగా ఈ సమస్య ఉంది. తూముల్లో వృథా పేరుకుపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని అధిగమించేందుకు నాలుగు మోటార్లు అమర్చారు. వీటికి ప్రత్యేక పైపులైనుతో ప్రాకారాలపై నుంచి వెలుపల డ్రైనేజీలోకి తరలిస్తున్నారు. అయితే మోటార్లు మోరాయించినపుడు, మరమ్మతులకు గురైన సందర్భాల్లో పరిస్థితి తీవ్రమవుతూ నీరు నిలిచిపోతోంది.
మరమ్మతులకు సాహసించని ఇంజనీర్లు
పురాతన తూములు మరమ్మతులు చేయాలంటే అదనంగా అమర్చిన గ్రానైట్ రాతి బండల్ని తప్పక తొలగించాల్సి ఉంటుంది. దీనిపై టీటీడీ ఇంజనీర్లు నాన్చుతున్నారు. మరమ్మతు పనులపై ఏమాత్రం చొరవ చూపటం లేదు. భక్తుల మనోభావాలతో కూడిన నిర్మాణం పనుల్లో రాతి బండల్ని తొలగించే సందర్భంలో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న ధోరణి వారిలో ఉంది.
సమీక్షిస్తాం..అవసరమైతే పూడిక తీయిస్తాం
పెద్ద వర్షం వస్తే నీళ్లు నిలుస్తుందన్న మాట వాస్తమే. నేను కూడా స్వయంగా పరిశీలించాను. నిపుణులతో సమీక్షిస్తాను. అవసరమైతే తూముల్లో పేరుకుపోయిన పూడిక తీసే పనులు చేయిస్తాం.
- టీటీడీ ఈవో సాంబశివరావు