ప్రత్యక్ష కార్యాచరణలోకి టీజేఏసీ
♦ ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంపై ఈఆర్‌సీకి కోదండరాం
♦ పీపీఏపై బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి
♦ ఆ ఒప్పందం ప్రజలు, ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని ఆందోళన
♦ ఈఆర్‌సీ చైర్మన్‌ను కలిసిన టీజేఏసీ బృందం
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి పోరాటాలతో తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్తబ్దుగా ఉండిపోయింది. ఉద్యమ కాలంలోనే టీఆర్‌ఎస్, టీజేఏసీ మధ్య అభిప్రాయ భేదాలకు బీజాలు పడగా.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా సఖ్యత కుదరలేదు. కోదండరాం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆరోపణలు, పోరాటాలకు దిగిన సందర్భాలు లేవు. ఎట్టకేలకు ఆయన మౌనం వీడారు. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం(పీపీఏ)పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... దీనిపై బహిరంగ విచారణ జరపాలని కోదండరాం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్‌సీ)ని కోరారు.
కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో టీఎన్జీవోల అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టీజీవోల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త కె.రఘు తదితరులున్నారు.
టీజే ఏసీ వినతిపత్రంలో ఏముందంటే..
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీజేఏసీ సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం క్రియాశీలకంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో వనరులు సద్వినియోగం కావాలనే ఆశయంతో ఈ విజ్ఞాపనను మీ ముందుంచుతున్నాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ(సీఎస్‌పీడీసీఎల్), తెలంగాణ డిస్కం మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వస్తున్న వార్తలు, ఈఆర్‌సీలో దాఖలైన అభ్యంతరాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఒప్పందం యథాతథంగా అమలైతే విద్యుత్ వినియోగదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇలాంటి ఒప్పందాలపై సమీక్ష జరిపే అధికారం ఈఆర్‌సీకి ఉంది. ప్రజలపై ప్రభావం పడే అంశాలపై బహిరంగ విచారణ జరపాలని హైకోర్టు సైతం గతంలో ఈఆర్‌సీని ఆదేశించింది. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో వివాదాస్పద అంశాలపై అర్థవంతమైన పరిష్కారాల కోసం ఛత్తీస్‌గఢ్ పీపీఏపై బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
పీపీఏపై కామెంట్ చేయను: కోదండరాం
ఛత్తీస్‌గఢ్ పీపీఏను తామేమీ తప్పుపట్టడం లేదని, దీనిపై వస్తున్న అభ్యంతరాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ఇప్పటికే వ్యక్తమైన అభ్యంతరాలు, డిస్కంల వివరణలపై బహిరంగ విచారణ జరపాలని మాత్రమే టీఎస్‌ఈఆర్‌సీని కోరామన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ హామీ ఇచ్చారన్నారు.