కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
Published Sun, Aug 28 2016 8:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ఏలూరు సిటీ : ఉమ్మడి సర్వీస్ రూల్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఉపాధ్యాయులకు పదోన్నతులు రాబోతున్నాయని, విద్యావ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు తెలిపారు. స్థానిక ఎన్‌ఆర్ పేటలో పీఆర్‌టీయూ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ రాము సూర్యారావు పాల్గొన్నారు. శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించి ఒత్తిడి లేకుండా చేయాలని కోరారు.
అనవసర పనిభారాన్ని తగ్గించి విద్యాబోధనపై దృష్టిసారించేలా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గతేడాది లాగే ఈ ఏడాది కూడా నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు అవార్డులు బహూకరిస్తామని తెలిపారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తె కమలాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, కేవీవీ సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శులు పి.ఆంజనేయులు, ఏవీ కాంతారావు, కె.కృష్ణకుమార్ పాల్గొన్నారు.
Advertisement