
అధికారులకు సహకరించాలి
⇒మార్పులు, చేర్పులు తెలియజేయాలి
⇒జాయింట్ కలెక్టర్ హరిత
వరంగల్ రూరల్: జిల్లాలోని ఓటర్ల జాబితాలో చేపట్టబోయే మార్పులు, చేర్పులపై అధికారులకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ముండ్రాతి హరిత రాజకీయ పార్టీల నాయకులను కోరారు.నర్సంపేట, పరకాల శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌పై సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సంఘం సూచనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల మార్పు, కొత్త కేంద్రాల ఏర్పాటు, జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఇచ్చిన నివేదికలను వారికి చదివి వినిపించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరిత మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఏమైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై గ్రామాల వారీగా త్వరలో చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని దీని ద్వారా ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల నమోదు తప్పోప్పుల సవరణ బూత్‌ల వారిగా ఎన్నికల సక్రమ నిర్వహణతో పాటు ఓటర్ల తుది జాబితా రూపకల్పనలోనూ బూత్ లెవల్ ఏజెంట్లు ముఖ్య భూమికను పోషిస్తారని జేసి సూచించారు. గత ఎన్ని కల నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, పుల్లూరి అశోక్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఎండీ షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.