సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట | To prevent irregularities with CBRT | Sakshi
Sakshi News home page

సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట

Published Mon, Nov 9 2015 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట

సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి
♦ పోటీపరీక్షల్లో ఆన్‌లైన్ విధానంతో పారదర్శకత
♦ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి
♦ తమ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తామన్న కర్ణాటక
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 5-10 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఘటనలు దేశంలో అనేకం జరిగాయని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్టు (సీబీఆర్‌టీ) ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సీబీఆర్‌టీ ద్వారా పరీక్షలను పక్కాగా నిర్వహించడంతోపాటు పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇందులో ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం సీబీఆర్‌టీ విధానంలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించింది.

ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను దత్తాత్రేయతోపాటు కర్ణాటక సర్వీసు కమిషన్ సభ్యులు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో తక్కువ సమయంలో పకడ్బందీగా క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం అభినందనీయమని కితాబునిచ్చారు. ఒక్కో పరీక్షకు 1,000 ప్రశ్నలు రూపొందించి, అందులో 150 ప్రశ్నలను ఎంపిక చేసి, అదీ ఒక అభ్యర్థికి వచ్చిన సీక్వెన్స్ మరో అభ్యర్థికి రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టారన్నారు.

టీఎస్‌పీఎస్సీ 31 వేల మందికి మొదటిసారిగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచిందని కొనియాడారు. తాము కూడా ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)లో ఆన్‌లైన్‌లో 8 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఎంతో భద్రత, పారదర్శకత కలిగిన ఆన్‌లైన్ విధానాన్ని భవిష్యత్తులో అన్ని ఉద్యోగ పరీక్షల్లో అమలు చేయాలని సూచించారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీసు (ఎన్‌సీఎస్) సెంటర్లను ప్రారంభించామని, వాటి ద్వారా దేశంలోని 983 ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లను అనుసంధానం చేశామన్నారు.

ఇందులో 3.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, వారు ఫోన్‌లోనే తగిన  ఉద్యోగ సమాచారం పొందుతారన్నారు. రూ.380 కోట్లతో 100 మోడల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌తో తమ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లను ఎలా అనుసంధానం చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, దేశంలో ఒకే విధమైన పరీక్ష విధానం కోసం యూపీఎస్సీ చూస్తోందన్నారు. తాము చేస్తున్న ఆన్‌లైన్ పరీక్షల విధానం అంతటా అమలు చేయవచ్చని చెప్పారు. ఓటీఆర్‌లో 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు.

ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలుచేసేందుకు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, రామ్మోహన్‌రెడ్డి, సాయన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక కమిషన్ ఇన్‌చార్జి చైర్మన్ ఎం.మహదేవ, సభ్యులు ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని పరీశీలించారు. ఈ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే గుజరాత్ ముందుకురాగా, కర్ణాటకలోనూ అమలు చేస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement