ఓట్ల కోసమే ముస్లిం రిజర్వేషన్లు
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం
సాక్షి, కొత్తగూడెం: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ అన్నారు. రెండు రోజులపాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమైనందున బీజేపీ రాజకీయంగా, న్యాయపరంగా దీనిని అడ్డుకుంటుంద న్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలు సరికాదు
జల్లికట్టుపై ఎంఐఎం పార్టీ వివాదం చేయడం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. జల్లికట్టుపై ఆందోళనలు తమిళుల సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. దీనిపై హిందూత్వానికి పెద్దదెబ్బ, వీహెచ్‌పీ వారికి చెంపపెట్టు అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడం చూస్తే.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
పెద్దనోట్ల రద్దు సాహసోపేతం: దత్తాత్రేయ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మక, సాహసోపేతమైనదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. నగదు రహిత లావాదేవీలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉద్దేశించినవని, పేద ప్రజలకు, దళితులకు, గ్రామీణులకు, రైతులకు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని, దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని అన్నారు. దేశంలో పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక కార్యకలాపాలు ఈ నిర్ణయం వల్ల జరుగుతాయని పేర్కొన్నారు. తొలిరోజు సమావేశంలో శాసనసభ పక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి, శాసన మండలిపక్ష నాయకుడు ఎన్.రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, వ్యవహారాల పర్యవేక్షకుడు కృష్ణదాస్, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.